CBSE Board Exam 2024: ఈ టిప్స్‌ పాటిస్తే 90% మార్కులు కొట్టేయొచ్చు.. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు నిపుణుల సూచనలు

సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతులతో పాటు రాష్ట్రంలోనూ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో జరగబోతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆ పరీక్షల్లో ఈ 8 సూత్రాలు పాటిస్తే 90% మార్కులు కొల్లగొట్టొచ్చంటున్నారు నిపుణులు.

New Update
సీబీఎస్ఈ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్

Preparation Tips for CBSE Board Exam 2024: పది, పన్నెండో తరగతులకు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) అన్ని ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ జరిగే ఈ పరీక్షలకు 35లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. మరోవైపు రాష్ట్రంలోనూ టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ కు టైం దగ్గర పడుతోంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే ఆ పరీక్షల్లో విజయం ఆధారపడి ఉంటుంది. అది సరిగ్గా ఉంటేనే కేటాయించిన సమయంలో విద్యార్థులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయగలరు. సమయపాలనలో నైపుణ్యం, ఏకాగ్రత, పక్కా ప్రణాళిక కలిస్తేనే ఏ బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో అయినా అత్యుత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకోవడం కష్టమేమీ కాదు.

1. సిలబస్‌పై పట్టు
ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సిలబస్‌ను (CBSE Syllabus) తెలుసుకుని, సమగ్రంగా అవగతం చేసుకోవడం బోర్డ్‌ ఎగ్జామ్స్‌ సన్నాహక దిశలో తొలి అడుగు. విద్యార్థులు మార్కుల పరంగా అంశాల వారీ వెయిటేజీని తెలుసుకుని, దానికి అనుగుణంగా సిద్ధమైతే ఉత్తమమైన మార్కులు పొందొచ్చు. కీలక అంశాలను క్షుణ్నంగా అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. కేవలం బట్టీ పట్టకుండా భావనలపై లోతైన అవగాహనతో గ్రహణశక్తిని పెంపొందించుకోవాలి.

2. స్టడీ షెడ్యూల్‌ రూపొందించుకోండి
సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుని స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. తద్వారా పరీక్షకు కనీసం రెండువారాల ముందే అన్ని అంశాలనూ కవర్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. సిలబస్‌ను టాపిక్‌ల వారీగా విభజించుకుని, ప్రతి సబ్జెక్టుకూ నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవచ్చు. సాధ్యమైనంత వరకూ ఒకదానికొకటి పూరకాలుగా ఉన్న సబ్జెక్టులను పరస్పరం పోల్చిచూడడం ద్వారా సంపూర్ణ అభ్యసన అనుభవాన్ని పొందవచ్చు. అధ్యయన షెడ్యూలులో పునశ్చరణకు అవకాశం ఉండేలా అధ్యయన షెడ్యూల్‌లో చిన్నచిన్న విరామాలను చేర్చండి.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ?

3. పాఠ్యపుస్తకాలకే పరిమితం కావొద్దు
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను (NCERT Books) క్షుణ్నంగా చదవాలి. అయితే, వాటికే పరిమితం కాకుండా.. ప్రామాణిక పుస్తకాలు, ఆన్‌లైన్‌ మెటీరియల్‌, విద్యా సంబంధ విషయాలను అందించే యాప్‌లు, వీడియో తరగతులు సహా వివిధ స్టడీ మెటీరియల్‌లతో విస్తృత స్థాయిలో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సందేహాల నివృత్తికి టీచర్లను సంప్రదించడంతో పాటు సహాధ్యాయులతో చర్చించడం ద్వారా అవగాహనను విస్తృతం చేసుకోవాలి.

4. సాధనే ఏకైక మార్గం
సాధనే విద్యార్థిని పరిపూర్ణుడిని చేస్తుంది. గణితం, విజ్ఞాన శాస్త్రాల వంటి కొన్ని సబ్జెక్టులకు మాత్రమే కాకుండా, మొత్తం ప్రశ్న పత్రాలకూ ఇది వర్తిస్తుంది. క్రితం సంవత్సరం ప్రశ్నపత్రాలు, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేస్తూ పరీక్ష విధానం, నమూనాను అవగతం చేసుకోవాలి. మాదిరి పరీక్షలు (మాక్‌టెస్టులు) ఎక్కువగా రాయడం ద్వారా బలంగా ఉన్న అంశాలు, మెరుగుపడాల్సిన సబ్జెక్టులు ఏమిటన్నది తెలిసొస్తుంది. అంతేకాకుండా ఎగ్జామ్‌ టైంలో సమయపాలన కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న 4 భారతీయ స్కాలర్‌షిప్‌ల వివరాలు!

5. సంపూర్ణంగా పునశ్చరణ
సరైన పునశ్చరణ లేకపోతే నేర్చుకున్న అంశాలన్నీ నిరుపయోగం కావచ్చు. నేర్చుకున్న అంశాలన్నిటినీ ఏకీకృతం చేయడానికి పలుమార్లు పునశ్చరణ చేయడం అత్యంత ముఖ్యమైన సాధనం. చదువుతూనే పునశ్చరణ చేయాల్సి ఉండగా; చివరిలో ఎక్కువ సమయం కాకపోయినా.. రెండు వారాలైతే రివిజన్‌కే కేటాయించాలి.

6. అభ్యసనాన్ని మెరుగుపరిచే నైపుణ్యాలు పాటించాలి
అభ్యసన శక్తిని పెంచుకోవడం పరీక్షలో ప్రదర్శనను సానుకూలం చేసే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. కీలక అంశాలు, సూత్రాలు, భావనలతో సంగ్రహంగా సంక్షిప్త నోట్‌లు సిద్ధం చేసుకోవడం ద్వారా పునశ్చరణను సులభతరం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో ఉన్న సమాచారాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి.

7. ఆరోగ్యం ప్రధానం.. దృష్టి మరల్చకండి
సమతౌల్య, పోషకాహారం తీసుకోండి. తగినంత నిద్ర పొందండి; తగినంత వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండండి. ఏకాగ్రత పద్ధతులను పాటించడం ద్వారా చదివే సమయంలో దృష్టి నిలిపేలా చూసుకోండి. శ్వాస వ్యాయామాలు లేదా ధ్యానం సడలింపు పద్ధతులను ఎంచుకోవచ్చు.

8. సానుకూలంగా ఉండి ఒత్తిడిని జయించండి
ప్రతికూలత లేదా ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకుంటూ, మీకు సంబంధించిన విషయాలను చర్చించడానికి టీచర్లు, మిత్రులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండాలి. సానుకూల ధోరణి, స్వశక్తిపై విశ్వాసం ద్వారా ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. సమగ్ర సన్నద్ధత, పునశ్చరణ, సమయ పాలన, సానుకూల దృక్పథం ఉంటే, బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో విజయం మీ సొంతం కాక తప్పదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు