Consumable Loans: పండుగ షాపింగ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలపై ఓ లుక్కేయండి..

పండుగల్లో కారు వంటి ఏదైనా ఖరీదైన వస్తువు కోసం లోన్ తీసుకోవాలంటే తక్కువ కాలానికి తీసుకోవాలి. అలాగే ఎక్కడ తక్కువ వడ్డీరేటు ఉంటుందో అక్కడ నుంచే లోన్ తీసుకోవాలి. అలాగే, ప్రాసెసింగ్ ఫీజులు.. ప్రీ క్లోజర్ పెనాల్టీ గురించి కూడా అర్ధం చేసుకోవాలి

New Update
Consumable Loans: పండుగ షాపింగ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలపై ఓ లుక్కేయండి..

ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా దీపావళి పండుగ రాబోతోంది. సాధారణంగా ఈ సమయంలో బంగారం, వెండి, ఆస్తి, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కారు కొనడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అయితే కారు కొనాలంటే అవసరమైన డబ్బు మొత్తం అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటప్పుడు లోన్ (Consumable Loans) తీసుకుని కారు కొనే ఆలోచన చేస్తారు చాలామంది.

మీరు ఈ పండుగ సీజన్లో షాపింగ్ కోసం ఏదైనా లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే, సరైన లోన్ ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1. వడ్డీరేట్లు..

బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా ఇతర వనరుల ద్వారా వడ్డీ రేట్ల గురించి సమాచారం పొందవచ్చు. కస్టమర్ల ప్రొఫైల్, రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లతో లోన్స్ ఇస్తాయి. వడ్డీ రేటు(Interest Rates)లో చిన్న తేడా ఉన్నా అది దీర్ఘకాలంలో మీ కారు కోసం మీకు పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తుందని గుర్తుంచుకోండి. చిన్న పాటి వడ్డీ రేటులో తేడా మీ ఈఎంఐలపై కూడా పెద్ద తేడాను చూపిస్తుంది.

2. ఎక్కువ కాలం రుణం తీసుకోకండి:

వీలైనంత తక్కువ కాలానికి రుణం తీసుకోండి. సాధారణంగా కారు లోన్ గరిష్టంగా 8 ఏళ్ల వరకు తీసుకోవచ్చు కానీ ఎక్కువ కాలం లోన్ తీసుకుంటే అధిక వడ్డీకి లోన్ ఇస్తారు. ఈ వడ్డీ రేటు స్వల్పకాలిక (3 నుంచి 4 సంవత్సరాల) లోన్ వడ్డీ రేటు కంటే 0.50% వరకు ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణం వాహనం ధరను 25-30% పెంచుతుంది.

3. ప్రీ క్లోజర్ పెనాల్టీపై దృష్టి పెట్టండి:

కారు లోన్ తీసుకునేటప్పుడు, మీరు రుణం తీసుకుంటున్న బ్యాంకు ప్రీ క్లోజర్ పెనాల్టీ(Pre Clouser-Penalty) తీసుకుంటుందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రీ క్లోజింగ్ అంటే కాలపరిమితికి ముందే రుణ మొత్తాన్ని చెల్లించడం. పెనాల్టీ రేట్లు అన్ని బ్యాంకులకు ఒకేలా ఉండవు. కాబట్టి, జాగ్రత్తగా బ్యాంకును ఎంచుకోండి. పెనాల్టీలు వసూలు చేయని లేదా చాలా తక్కువ మొత్తాన్ని వసూలు చేసే బ్యాంకులను పరిగణించండి.

4. ప్రాసెసింగ్ ఫీజు చెక్:

కారు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి దాదాపు ప్రతి బ్యాంకు నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తుంది. కొన్ని బ్యాంకులు, ఏజెన్సీలు తక్కువ వడ్డీకే వెహికల్ లోన్స్ ఇస్తుండగా, రుణాలు ఇచ్చేటప్పుడు చాలా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అందువల్ల రుణం తీసుకునే ముందు, రుణాన్ని ప్రాసెస్ చేయడానికి ఎంత ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుందో బ్యాంకు నుంచి స్పష్టంగా తెలుసుకోవాలి.

5. ప్రత్యేక ఆఫర్లు - పథకాలు:

చాలా బ్యాంకులు పండుగ సీజన్ (Festival Season)లేదా సంవత్సరంలో ఒక నిర్దిష్ట కాలంలో వెహికల్ లోన్స్ పై ప్రత్యేక ఆఫర్లను అందిస్తాయి. ఇలాంటి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆఫర్లలో ప్రాసెసింగ్ ఫీజు - ప్రీ-క్లోజర్ పెనాల్టీపై మినహాయింపు, వాహనంపై 100% ఫండింగ్, తక్కువ లేదా 0% వడ్డీ రేటు, స్పెషల్ గిఫ్ట్ వోచర్లు మొదలైనవి ఉన్నాయి. మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్నవారు బెస్ట్ డీల్ పొందవచ్చు.

ఏది ఏమైనా లోన్ తీసుకుని కారు కానీ, మరేదైనా వస్తువును కానీ కొనేటప్పుడు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. తొందరపాటుతో కాలిక్యులేట్ చేసుకోకుండా లోన్ తీసుకుంటే తరువాత ఇబ్బంది పడే అవకాశం ఉంది.

Also Watch:

Advertisment
Advertisment
తాజా కథనాలు