TG News: ప్రభుత్వం, నాయకుల గురించి ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడితే తోడ్కలు తీస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఫేక్ జర్నలిస్టులు ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతామన్నారు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. హద్దు దాటితే, మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.
అమ్మ, చెల్లిపై వల్గర్ పోస్టులు..
ఈ మేరకు అసెంబ్లీ వేదికగా సోషల్ మీడియా వల్గర్ కామెంట్స్‌పై మాట్లాడిన సీఎం రేవంత్.. 'కొంతమంది మా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు బయట తిరగలేడు. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా? జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతాం' అంటూ ఆగ్రహంతో ఊడిపోయారు.
నాకు రక్తం మరుగుతోంది..
INPR, DAVP పత్రికలు, ప్రసారా సాధనాలున్నవారే జర్నలిస్టులా? లేక యూట్యూబ్ పెట్టుకుని ఏదిపడితే అది మాట్లాడిన వారు జర్నలిస్టులా తమ క్లారిటీ ఇవ్వాలని జర్నలిస్ట్ సంఘాల నాయకులను కోరారు. నాకు రక్తం మరుగుతోంది. మీకు కుటుంబాలు లేవా? భార్య పిల్లలు లేరా? అని మండిపడ్డారు. ఇకపై తప్పుడు ప్రచారం చేసినా, వల్గర్ కామెంట్స్ చేసినా, ఆడబిడ్డల గురించి బూతులు మాట్లాడితే ఇప్పటినుంచి తోడ్కలు తీస్తానన్నారు. తెలంగాణ సమాజం ఇదేనా? రజకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురించి నిలబడిన వాడు మొనగాడు. అలాంటి ప్రాంతాన్ని నాశనం చేసి, విష సంస్కృతిని ఉసిగొల్పాలని చూస్తే ఉరికిచ్చి కొడతామన్నారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
అలాగే కేసీఆర్ జర్నలిస్టులను, ఎస్సీలను అవమానించారని విమర్శించారు. నేను మర్యాదగా ఉంటున్నా. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. నాకు చికాకు వచ్చి ఒక్కమాట చెబితే మా పిల్లలంతా వారిని బట్టలు విప్పి కొడతారు. హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవిస్తారు. నేను ఉన్నంతకాలం నిటారుగా, నికార్సుగా ఉంటా. ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను. జైలుకు పోతే బెయిల్ వస్తదని అనుకుంటే చట్టాలను సవరిస్తాం. ఆడపిల్లల ఫ్లాట్ ఫామ్ లో దారుణమైన బూతులుంటున్నాయి. వీటిని క్షమించే ప్రసక్తే లేదు. భవిష్యత్తు తరాలకు ఈ భాష ఒంటబట్టకుండా ఇక్కడే పాతరేస్తాం. తప్పులుంటే తమ ప్రభుత్వం సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉందంటూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
చివరగా మీడియా మిత్రులు, సంఘ నాయకులు జర్నలిస్టుల లిస్ట్ ఇవ్వాలని కోరారు. అసలైన విలేఖర్ల గుర్తింపు ఏదో నిర్ణయించాలన్నారు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతోచర్చలు జరిపి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు.