/rtv/media/media_files/2025/03/14/VP5i3TtAAR3jpPjzRAdd.jpg)
UttarPradesh Ayodhya ew couple Murder
Couple Murder: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఓ జంట పెళ్లి ఘనంగా జరిగింది. నవ దంపతులు ఘనంగా ఊరేగింపు జరుపుకుని అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. మరుసటి రోజు రిసెప్షన్ కోసం సన్నాహాలు నడుస్తుండగా ఒకపక్క ఇంట్లో పాటల కార్యక్రమం నడుస్తోంది. మరికొందరు నిద్రపోయారు. అప్పుడే అసలు కథ మొదలైంది. వధూవరులు కాసేపు కునుకు తీసేందుకు గదిలోకి వెళ్లారు. కాసేపటికి బంధువులు వెళ్లి తలుపు కొట్టగా ఎంతకు తీయలేదు. ఫోన్ చేసిన స్పందించలేదు. చాలాసార్లు తలుపు తట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. చివరికి గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా గుండెపగిలే దృశ్యం కనిపించింది. నవ వధువులు ఇద్దరు విగతజీవులుగా కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ భయంకరమైన ఘటన యూపీలో కలకలం రేపగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకరు మంచంలో మరొకరు ఫ్యాన్ కు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్య నివాసి అయిన ప్రదీప్, శివానికి మార్చి 7న ఉదయం వివాహం జరిగింది. సాయంత్రం వివాహ ఊరేగింపు చాలా కోలాహలంతో షహదత్‌గంజ్ నుంచి డీలిసారియకు చేరుకున్నారు. మార్చి 9 ఆదివారం రిసెప్షన్ ఉంది. అయితే శుక్రవారం రాత్రి దాదాపు 12.30గంటలకు వరుడు ప్రదీప్, వధువు శివాని తమ గదికి వెళ్లారు. తలుపు మూసుకున్నారు.
కాసేపటికి బంధువులు వారిని పిలవగా ఎలాంటి శబ్దం రాకపోవడంతో తలపులు విరగొట్టి చూడగా ఇద్దరు చనిపోయారు. శివాని మంచం మీద చనిపోయి పడి ఉండగా ప్రదీప్ మృతదేహం ఫ్యాన్‌కు కట్టిన ఉచ్చుకు వేలాడుతూ ఉంది. ప్రదీప్ మృతదేహాన్ని వెంటనే కిందకు దించి వధూవరులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇద్దరూ చనిపోయారని వైద్యులు తెలిపారు. దీంతో కన్నీరుమున్నీరైన బంధువులకు మృతదేహాలను అప్పగించామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !
గొంతు కోయడం వల్లే..
అయితే సంతోషంగా పెళ్లి జరిగిన 24 గంటల్లోనే వధూవరులు మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆశ్చర్యం ఏమిటంటే వివాహ ఊరేగింపు నుంచి వధూవరులు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమ ఫోటోలు తీసుకున్నారు. వరుడు ప్రదీప్ కూడా తన పెళ్లి ఆనందంలో డ్యాన్స్ చేశాడు. అన్యూహ్యంగా చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం శివాని గొంతు కోయడం వల్లే మరణించినట్లు నిర్ధారించారు. ఆ తర్వాతే ప్రదీప్ ఉరి వేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. గది తలుపు లోపలి నుంచి లాక్ చేసినందున బయటి వ్యక్తి ఎవరూ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. కాబట్టి ప్రదీప్ మొదట శివానీని గొంతు కోసి చంపి, ఆపై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్!
ఏడాదిగా పరిచయం..
ప్రదీప్, శివానీల సంబంధం దాదాపు ఒక సంవత్సరం క్రితం బలపడింది. వారిద్దరూ ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవారు. వివాహంలో పాల్గొన్న రెండు కుటుంబాలు చెప్పిన దాని ప్రకారం.. ఇద్దరూ చాలా సంతోషంగానే పెళ్లి చేసుకున్నారు. శివాని తల్లి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పింది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి మొబైల్స్, కాల్ వివరాలు, చాట్స్ పరిశీలిస్తున్నారు. బంధువులను విచారిస్తూ ఈ హత్యల వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.