/rtv/media/media_files/2025/01/30/YupYLZwnPzhi8fCSffAb.jpg)
Maha Kumbh stampede Photograph: (Maha Kumbh stampede)
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు పిటిషనర్. తొక్కిసలాట ఘటనపై స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఇదే సమయంలో తొక్కిసలాటకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇలాంటి మతపరమైన కార్యక్రమాల్లో వీఐపీల రాకపోకలను పరిమితం చేయాలని, సామాన్యులకు గరిష్టంగా స్థలం కేటాయించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద మతపరమైన కార్యక్రమాల్లో తొక్కిసలాటను నివారించడానికి, ప్రజలకు సరైన సమాచారం అందించడానికి, దేశంలోని ప్రధాన భాషలలో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని, మొబైల్, వాట్సాప్‌లో రాష్ట్రాలు తమ యాత్రికులకు సమాచారం అందించాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌తో సమన్వయంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైద్య బృందాలను ప్రయాగ్‌రాజ్‌లో కూడా మోహరించాలని కోరారు.
కాగా హాకుంభమేళాసందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. జనవరి 29 తెల్లవారుజామున ఘాట్‌లో ఏర్పాటు చేసిన బారికెట్లు ధ్వంసం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని డీఐజీ వైష్ణవ్ కృష్ణ తెలిపారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ కృష్ణ కుమార్ ఆద్వర్యంలో న్యాయ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈ విషాద ఘటనలో 90 మందిని హాస్పిటల్‌లో చేర్పించామని వారిలో 36 మందికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున అమృత స్నానం చేసేందుకు త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంల బారికేడ్లు విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.