/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-13-37-26.jpg)
Jana Sena targets the South
Jana Sena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు తన సరిహద్దులను దాటి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం కేరళ రాజధాని త్రివేండ్రం (తిరువనంతపురం) వేదికగా జనసేన కీలక సమావేశాన్ని నిర్వహించింది.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, పార్టీ సెక్రటరీ తల్లూరి రామ్‌లతో కలిసి కేరళలో పర్యటించారు. త్రివేండ్రంలో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, కాంగ్రెస్ వంటి వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది మలయాళీ నేతలు, కార్యకర్తలు నాగబాబు సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. "రాజకీయాలు రాష్ట్రానికి ఒకలా ఉండొచ్చు కానీ, జనసేన సిద్ధాంతం మాత్రం ఎక్కడున్నా ఒక్కటే. భాషా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా పవన్ కల్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం" అని స్పష్టం చేశారు. కేరళ తర్వాత జనసేన తదుపరి లక్ష్యం తమిళనాడు. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు: పవన్ కల్యాణ్ తన బాల్యం, విద్యాభ్యాసం,సినిమాల్లోకి రాకముందు ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపారు. దీనివల్ల ఆయనకు అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది.
తమిళ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులతో పవన్ కు ఉన్న వ్యక్తిగత సంబంధాలను పార్టీ బలోపేతానికి వాడుకోవాలని జనసేన యోచిస్తోంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఇప్పటికే అశేషమైన అభిమాన గణం ఉంది. ఈ క్రేజ్‌ను ఓటు బ్యాంకుగా మలిచే వ్యూహంతో పార్టీ ముందుకు వెళ్తోంది.మాస్టర్ ప్లాన్ జనసేన విస్తరణ కేవలం ఒకట్రెండు రాష్ట్రాలకే పరిమితం కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో యూనిట్ పనులు ప్రారంభం కాగా, త్వరలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించిన తర్వాత, ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి సారించి జనసేనను ఒక పూర్తి స్థాయి జాతీయ పార్టీగా మార్చడమే పవన్ కల్యాణ్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాలనలో పాలుపంచుకుంటూనే, మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించడం పవన్ కల్యాణ్ రాజకీయ పరిణతికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమం, అవినీతి రహిత రాజకీయాలే ఏజెండాగా జనసేన ఇతర రాష్ట్రాల్లోకి అడుగుపెడుతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Follow Us