/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
Elon Musk with trump Photograph: (Elon Musk with trump)
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) .. తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ పాలనలో మస్క్ జోక్యం పై ఎదురైన ప్రశ్నకు అధ్యక్షుడు ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాల్లో మస్క్ జోక్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు.
Also Read: Trump: భారత్ దగ్గర బోలెడు డబ్బులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మస్క్ (Elon Musk) నిర్వహిస్తున్న వ్యాపారాలతో సంబంధం ఉన్నశాఖలకు ఆయన దూరంగా ఉంటారు. అంతరిక్ష సంబంధ వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాల్లో ఆయన జోక్యం ఉండదు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. ఇక మస్క్, ట్రంప్ లు కలిసి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
డోజ్ నిర్వహణకు మస్క్ కంటే తెలివైన వ్యక్తి కోసం తాను వెతికానని...ఎవరూ దొరక్కపోవడంతో ఆయన్నే ఎంపిక చేసినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. వివిధ శాఖల్లోని వృథా ఖర్చును మస్క్ తగ్గిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ల అమలులో డోజ్ టీమ్ సమర్థవంతంగా పని చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా...క్యాపిటల్ భవనం దాడి నేపథ్యంలో ఎక్స్ ఖాతా నిషేధం పై ట్రంప్ వేసిన దావా పై మస్క్ రాజీకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.తాజాగా ఇరువురు నేతలు దీన్ని ఖండించారు. అది న్యాయసంబంధిత విషయమని మస్క్ పేర్కొనగా..తాను మస్క్ నుంచి మరింత ఎక్కువ డబ్బు ఆశిస్తున్నట్లు ట్రంప్ సరదాగా బదులిచ్చారు.
వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా...
అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖకు ఎలాన్ మస్క్ ను సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా డోజ్ పని చేస్తుందని అధ్యక్షుడు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ యంత్రాంగాన్ని మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఫెడరల్ ఏజెన్సీలు డోజ్ తో సంప్రదింపులు చేసిన తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాల పై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన మేరకు మాత్రమే నియామకాలు చేపట్టాలని అందులో తెలిపారు. ఇదిలా ఉండగా..మస్క్ ఓ సర్వీసు ఉద్యోగి మాత్రమేనని వైట్ హౌస్ తాజాగా స్పష్టం చేసింది. వైట్ హౌస్ లోని సీనియర్ సలహాదారుల మాదిరిగానే స్వతహాగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొనే అధికారం మస్క్ కు లేదని వైట్ హౌస్ వ్యవహారాల డైరెక్టర్ జోషువా ఫిషర్ పేర్కొన్నారు.మస్క్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ న్యూ మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఓ కేసుకు సంబంధించి వైట్ హౌస్ ఈ వివరణ ఇచ్చింది.
Also Read: Nara lokesh: ఏపీలో టీచర్లకు తీపికబురు చెప్పిన మంత్రి లోకేష్