/rtv/media/media_files/2026/05/16/donald-trump-announces-killing-of-isis-leader-abu-bilal-al-minuki-2026-05-16-13-12-24.jpg)
donald trump announces killing of isis leader abu bilal al minuki
Donald Trump : ఉగ్రసంస్థ ఐసిస్ (ISIS) గ్లోబల్ కార్యకలాపాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఫ్రికాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ అగ్ర కమాండర్, సంస్థలో నెం.2 నాయకుడిగా ఉన్న అబు-బిలాల్ అల్-మినూకి (Abu-Bilal al-Minuki) ని తమ దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(america president donald trump) అధికారికంగా ప్రకటించారు. తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, ఆఫ్రికా ప్రజలకు ఒక పెద్ద పీడ విరగడయ్యిందని వ్యాఖ్యానించారు. అమెరికా దళాలు నైజీరియా(nigeria) భద్రతా దళాలతో కలిసి అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడని పేర్కొన్నారు. - isis-terrorists
నైజీరియాలో జన్మించిన మినూకి, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా(africa) ప్రావిన్స్ (ISWAP) లో సీనియర్ కమాండర్‌గా పనిచేసేవాడు. అంతర్జాతీయంగా ఐసిస్ ఉగ్రమూకల దాడులకు మార్గనిర్దేశనం చేయడంతో పాటు, టెర్రర్ సెల్స్‌కు సూచనలు ఇవ్వడం, గ్లోబల్ ఆపరేషన్ల కోసం నిధులు సమకూర్చడం వంటి కీలక బాధ్యతలను అతడు పర్యవేక్షించేవాడు. పలు మారుపేర్లతో చలామణి అవుతూ ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన అతడిని, అమెరికా ప్రభుత్వం 2023లోనే గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్లాన్ చేయడంలోనూ అతడు ప్రధాన పాత్ర పోషించాడు.
ఆఫ్రికా లాంటి మారుమూల ప్రాంతాల్లో దాక్కుంటే తనను ఎవరూ ఏమీ చేయలేరని మినూకి భావించాడని, కానీ అమెరికా గూఢచార వర్గాల నిఘా నీడ నిరంతరం అతడిపైనే ఉందనే విషయాన్ని అతడు పసిగట్టలేకపోయాడని ట్రంప్ ఎద్దేవా చేశారు. తన ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ జరిగిందని, మినూకి అంతంతో అతడి ఉగ్రనీడ తొలగిపోయిందని చెప్పారు. ఇకపై అతడు ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేడని, ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రకార్యకలాపాలు దీనితో మరింత బలహీనపడతాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కీలకమైన మిషన్‌లో అమెరికా బలగాలకు పూర్తి స్థాయిలో సహకరించిన నైజీరియా ప్రభుత్వానికి, అక్కడి భద్రతా దళాలకు ఈ సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read : Explainer: ఇరాన్-తైవాన్ నుండి వ్యాపారం వరకు... ట్రంప్ తన చైనా పర్యటనలో సాధించింది ఏంటి?
ఐసిస్ నేపథ్యమిది
ప్రపంచవ్యాప్తంగా ఘోరమైన నరమేధాలకు, ఆటవిక దాడులకు పాల్పడిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS - ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) నేపథ్యం సుదీర్ఘమైన రక్తపాతంతో కూడుకున్నది.ఇరాక్ యుద్ధం తర్వాత అప్పటికే క్రియాశీలకంగా ఉన్న “అల్-ఖైదా ఇన్ ఇరాక్” (AQI) అనే ఉగ్రవాద గ్రూప్ నుంచి తీవ్రమైన విభేదాల కారణంగా ఒక వర్గం విడిపోయింది. అదే కాలక్రమేణా బలపడి, 2014లో అబూ బకర్ అల్-బగ్దాది నేతృత్వంలో “ఇస్లామిక్ స్టేట్” (IS) గా రూపాంతరం చెందింది. ఇరాక్, సిరియాల్లోని విశాలమైన భూభాగాలను ఆక్రమించుకున్న ఈ సంస్థ, అక్కడ తమ సొంత రాజకీయ-మతాధికార వ్యవస్థ అయిన 'ఖలీఫత్'ను ప్రకటించుకుని ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
ప్రపంచవ్యాప్త దాడులు - ఉగ్ర నెట్‌వర్క్ విస్తరణ
ఖలీఫత్ ప్రకటించిన తక్కువ కాలంలోనే ఐసిస్ ప్రపంచ దేశాలపైకి తన ఉగ్రవ్యాప్తిని వేగవంతం చేసింది. 2015లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఘోర దాడులు, 2016 నాటి బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు, అమెరికాలోని ఒర్లాండో నైట్‌క్లబ్ షూటింగ్ వంటి ఘటనలతో పశ్చాత్య దేశాలను అతలాకుతలం చేసింది. వీటితో పాటు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలలో లెక్కలేనన్ని ఆత్మాహుతి దాడులు, సామూహిక హత్యలకు పాల్పడుతూ తన ఉగ్ర మూలాలను విస్తరించుకుంది. ఐసిస్ అమానుష వైఖరిని ఖండిస్తూ అమెరికా, భారతదేశం, ఇరాక్‌లతో పాటు ఐక్యరాజ్యసమితిలోని పలు ప్రధాన దేశాలు దీనిని అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించాయి.
నాయకత్వ మార్పులు (ఖలీఫాలు)
అంతర్జాతీయ దళాల దాడుల్లో ఐసిస్ అగ్ర నాయకులు వరుసగా హతమవుతూ వచ్చారు. సంస్థను స్థాపించిన అబూ బకర్ అల్-బగ్దాది (2013–2019) అమెరికా ఆపరేషన్‌లో మరణించగా, ఆ తర్వాత వచ్చిన అబూ ఇబ్రాహీం అల్-హషిమీ అల్-ఖురైషీ (2019–2022), ఆపై బాధ్యతలు చేపట్టిన అబూ అల్-హసన్ అల్-ఖురైషీ (2022), అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సైనీ అల్-ఖురైషీ (2022–2023) లు కూడా వివిధ సైనిక దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం ఈ సంస్థకు అబూ హఫ్స్ అల్-హషిమీ అల్-ఖురైషీ (2023 నుండి) ఖలీఫాగా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుత పరిస్థితి
ఒకప్పుడు ఇరాక్, సిరియాలలో సొంతంగా సామ్రాజ్యాన్ని, సైన్యాన్ని నడిపిన ఐసిస్.. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ దళాలు, స్థానిక సైన్యాల ఉమ్మడి పోరాటంతో క్రమక్రమంగా తన భూభాగాలను కోల్పోయి తీవ్రంగా బలహీనపడింది. ప్రస్తుతం ఈ ఉగ్ర నెట్‌వర్క్ మునుపటిలా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా, ఆఫ్రికా మరియు ఆసియా ఖండాల్లోని కొన్ని ప్రాంతాలలో చిన్నచిన్న ముఠాలుగా (Terror Cells) విడిపోయి, గెరిల్లా తరహా దాడులకు ప్రయత్నిస్తోంది.
Also Read : బెర్ముడా దీవుల కింద ‘సైన్స్’ గుట్టు ... 3 కోట్ల ఏళ్ల నిగూఢ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!
Follow Us