/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
murder
బావ బతుకు కోరేవాడు బావమరిది అంటారు. కానీ ఇక్కడ ఓ బావమరిది మాత్రం బావ ఇన్సూరెన్స్ డబ్బులు (Insurence Money) కోసం హత్య చేశాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్‌నాయక్ (42) అమీన్‌పూర్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన అమీన్‌పూర్ శివారులోని శ్మశానవాటిక వద్ద పొదల్లో దారుణహత్యకు గురైయ్యాడు.
కుటుంబసభ్యులు చేరుకుని మృతుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. గోపాల్‌నాయక్‌ను సొంత బావమరిదే హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్‌నాయక్ ఏడాది క్రితం జేసీబీ కొనుగోలు చేసి కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. అతడి బావమరిది నరేశ్‌నాయక్ మాయమాటలు చెప్పి మూడు నెలల క్రితం పోస్టాఫీసులో గోపాల్‌నాయక్ పేరు మీద డెత్‌క్లైం పాలసీ తీసుకున్నాడు.
చున్నీతో ఉరేసి దారుణంగా..
నామినీగా తన పేరును రాయించుకున్నాడు. జేసీబీ, ఇన్సూరెన్స్ డబ్బులపై కన్నేసి ఎలాగైనా గోపాల్‌నాయక్‌ను హత్య చేయాలని నరేశ్ పథకం పన్నాడు. హత్యకు తన మేనమామ దేవీసింగ్ సహాయం తీసుకున్నాడు. శనివారం రాత్రి అమీన్‌పూర్ శివారులోని శ్మశానవాటిక వద్దకు గోపాల్‌నాయక్‌ను తీసుకెళ్లి చున్నీతో ఉరేసి దారుణంగా హతమార్చి అక్కడే పొదల్లో పడేసి పరారయ్యారు.
నిందితులను అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.