/rtv/media/media_files/2026/06/06/kalvakuntla-kavitha-2026-06-06-13-01-20.jpg)
Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేదవారికి అన్యాయం చేస్తూ, బడాబాబులకు దోచిపెట్టే పాలన సాగుతోందని ఆమె ఆరోపించారు. దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పెద్దలు అప్పనంగా కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను వరుసగా ప్రజల ముందు ఉంచుతామని కవిత హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్ల మాదిరిగా తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు కాంగ్రెస్ పార్టీని మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో బొందపెట్టేలా ఉందని, ప్రజాగ్రహం కారణంగా కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి ప్రభుత్వం కాబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి సంపదను కాపాడేందుకే తాము కొత్త పార్టీని పెట్టామని, ప్రాణం పోయినా ఇంచు భూమిని కూడా దోపిడీ కానివ్వబోమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వానికి, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అవినీతికి, భూ దోపిడీకి కిటికీలు తెరిస్తే.. రేవంత్ రెడ్డి ఏకంగా తలుపులు బద్దలు కొట్టారని విమర్శించారు. "అప్పుడు గత హయాంలో కేటీఆర్ (కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు) పాలన నడిస్తే.. ఇప్పుడు కూడా కేటీఆర్ (కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి) పాలనే నడుస్తోంది" అంటూ సీఎం కుటుంబ సభ్యుల జోక్యాన్ని ఎండగట్టారు. గతంలో ఫినిక్స్ సంస్థకు 50 ఎకరాలు ఇస్తే వ్యతిరేకించిన రేవంత్, ఇప్పుడు అదే సంస్థకు మరో వంద ఎకరాలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కూకట్‌పల్లిలోని మంజీర కాలనీ లాంటి ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చుతున్న 'హైడ్రా' సంస్థ, బడా బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని కవిత ప్రశ్నించారు. మూసీ నది గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 'శ్రీ ఆదిత్య' బిల్డింగ్‌ను హైడ్రా ఎందుకు తాకడం లేదని నిలదీశారు. గతంలో తాము అక్కడ ధర్నా చేస్తే తమపై దాడికి ప్రయత్నించారని, కానీ తాము గట్టిగా ఆధారాలు చూపించడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. ఆ బిల్డర్ వెనుక ఒక కాంగ్రెస్ ఎంపీ ఉన్నారని, ఆయన పేరును త్వరలోనే బయటపెడతానని కవిత సవాల్ విసిరారు.
ఉపగ్రహ చిత్రాలు (శాటిలైట్ ఇమేజెస్) ప్రదర్శిస్తూ ప్రేమవతి పేట పెద్ద చెరువులో జరిగిన ఆక్రమణలను కవిత వివరించారు. 2021 నాటి అనుమతులకు భిన్నంగా 2023 నాటికి చెరువులో ఏడు ఎకరాల (రూ. 700 కోట్ల విలువైన) శిఖం భూమిని కబ్జా చేసి, అక్కడ 30 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకునే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మేడిబావి, జాలుబావి చెరువుల వద్ద సర్వే నంబర్ 59లో 'మెగా'కు చెందిన ఐకాం ఆయుధ తయారీ సంస్థ ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసిందని, దీనిపై మున్సిపాలిటీలో తీర్మానం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన భూమిపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోడి చెరువు పరిధిలో కొన్న 10 ఎకరాల భూమి పూర్తిగా 'శిఖం' భూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 3 ఎకరాలు మాత్రమే శిఖం అని, మిగిలిన 7 ఎకరాలు మాగాణి అని తప్పుడు వివరాలు రాశారని ఆరోపించారు. "ఆక్రమణ అని తేలితే ప్రభుత్వం తీసేసుకోవచ్చు అని పవన్ కల్యాణే చెప్పారు కదా.. ఇప్పుడు మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆయన వెంటనే ఆ 10 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చి, అక్కడ వేసిన మట్టి, కంటైనర్లను తొలగించాలి" అని డిమాండ్ చేశారు. బాధితుడైన రైతుకు ఇచ్చినట్లే పవన్‌కు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
ఇటీవల పవన్ కల్యాణ్ "తెలంగాణ మీ అయ్య జాగీరా?" అంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. "ఇది బరాబర్ మా జాగీరే.. 1200 మంది అమరవీరుల త్యాగాలతో, కడుపు కట్టుకుని పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇక్కడి ప్రజల సొత్తు. ఇది పవన్ కల్యాణ్ తాతల, ముత్తాతల జాగీరు కాదు" అని గర్జించారు. ఆంధ్రాలో రాజధాని కట్టుకోలేక ఇక్కడికి వచ్చి డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా విషకోరల నుంచి తెలంగాణను సాధించుకున్నామని, ఇక్కడ వన్ సైడ్ లవ్ అంటూ బలవంతపు రాజకీయం చేస్తామంటే కుదరదని, ముందు ఆంధ్రా ప్రజలకు మేలు చేసుకోవాలని హితవు పలికారు.
గతంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు తాను కారు కొనిచ్చానని పవన్ కల్యాణ్ చెప్పుకోవడంపై కవిత మండిపడ్డారు. కుడిచేత్తో చేసే దానం ఎడమచేతికి తెలియద్దని అంటారని, కానీ ఎప్పుడో చేసిన సాయాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ ఒక గొప్ప కళాకారుడిని అవమానిస్తారా అని నిలదీశారు. టాలీవుడ్ సినిమాలకు నైజాం (తెలంగాణ) ప్రాంతం నుంచే అత్యధిక కలెక్షన్లు వస్తాయని, ఆ లెక్కన పవన్ కొన్న కార్లు, భూముల్లో తెలంగాణ ప్రజల సొమ్ము ఉందన్నారు. ఎంతోమంది ఫోక్ సింగర్స్ (జానపద కళాకారుల) ట్యూన్లను కాపీ కొట్టి సినిమాల్లో వాడుకుంటున్న సినీ పెద్దలు, వారికి ఎప్పుడైనా రాయల్టీ ఇచ్చారా లేదా చిన్న నిర్మాతలను ఆదుకున్నారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటి పారుదల రంగంపై కనీస అవగాహన లేదని కవిత విమర్శించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం, 30 నెలలుగా పాలమూరు ప్రాజెక్టుపై రివ్యూ చేయలేదని, తాము ధర్నాలు చేస్తేనే మొదటిసారి సమీక్ష నిర్వహించారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో ఉన్న తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడిని కలిసి కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావలసిన 200 టీఎంసీల నీటి గురించి అడగకుండా, ఆంధ్రాకు 260 టీఎంసీలు తరలించుకుపోతుంటే మౌనంగా ఉంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌లో మొత్తం ధాన్యం కొంటూ, తెలంగాణలో పరిమితులు విధిస్తుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రజా సమస్యలపై తాను 'ఇష్యూ బేస్డ్' పాదయాత్రలు చేయబోతున్నట్లు కవిత ప్రకటించారు. పాలమూరు- రంగారెడ్డి పరిధిలోని లక్ష్మీదేవిపల్లి బ్యారేజీ సాధన కోసం త్వరలోనే పాదయాత్రను ప్రారంభిస్తానని, పాలమూరు నుంచే టీఆర్ఎస్ ఉద్యమం మళ్లీ మొదలవుతుందని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే అఖిలపక్ష సమావేశానికి తమను పిలవకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఉప్పల్ భగాయత్, నాదర్‌గుల్‌లో ఉన్న ప్రభుత్వ భూములను ఉద్యమకారులకు కచ్చితంగా కేటాయించాలని, దీనికోసం వచ్చే నెల ఉప్పల్ భగాయత్‌లో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని కవిత పిలుపునిచ్చారు.
Follow Us