Communist parties : ‘కమ్యూనిస్టు’ల కు చెల్లు చీటి....కంచుకోటలకు బీటలు

భారత రాజకీయ యవనికపై దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడించిన వామపక్షాల వైభవం నేడు చారిత్రక సంధికాలంలో పడింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్ట్ లు అధికారంలో లేకపోవడం ఒక శకానికి ముగింపుగా కనిపిస్తోంది.

New Update
FotoJet - 2026-05-05T070912.180

Communist parties

Communist parties : భారత రాజకీయ యవనికపై దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడించిన వామపక్షాల వైభవం నేడు చారిత్రక సంధికాలంలో పడింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి లేకపోవడం ఒక శకానికి ముగింపుగా కనిపిస్తోంది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లో అజేయ శక్తులుగా నిలిచిన కమ్యూనిస్టులు, ప్రస్తుతం తమ చివరి కంచుకోట అయిన కేరళలోనూ అధికారాన్ని కోల్పోవడం వారి రాజకీయ ప్రభ క్షీణించిందని స్పష్టం చేస్తోంది. 1977 నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా వామపక్ష సీఎం ఉండేవారు, కానీ తాజా ఫలితాలు ఆ రికార్డుకు తెరదించాయి.

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల పాలన భారత రాజకీయ చరిత్రలో ఒక అద్భుతం. 1977 నుండి 2011 వరకు ఏకంగా 34 ఏళ్ల పాటు సీపీఎం నేతృత్వంలోని ఫ్రంట్ అక్కడ ఏకధాటిగా పాలించింది. జ్యోతిబసు వంటి ఉద్దండ పిండాలు 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. భూసంస్కరణలు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించినా, కాలక్రమేణా పారిశ్రామిక విధానాలు, రాజకీయ మార్పుల వల్ల మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. బెంగాల్‌లో కోల్పోయిన పట్టును ఇప్పటికీ తిరిగి సాధించలేకపోవడం ఆ పార్టీల బలహీనతకు నిదర్శనం.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ వామపక్షాలది ఒకప్పుడు తిరుగులేని ప్రస్థానం. 1993 నుండి 2018 వరకు పాతికేళ్ల పాటు అక్కడ ఎర్రజెండా రెపరెపలాడింది. మాణిక్ సర్కార్ వంటి నిరాడంబర ముఖ్యమంత్రి నేతృత్వంలో సుదీర్ఘ కాలం పాలించినా, 2018లో బీజేపీ దూకుడు ముందు వామపక్ష వ్యూహాలు ఫలించలేదు. ఇక కేరళలో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ పినరయి విజయన్ వరుసగా రెండోసారి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించినా, తాజా ఎన్నికల్లో ఓటమి పలకరించడం వామపక్ష శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దక్షిణాదిలో ఉన్న ఏకైక అధికారం కూడా చేజారడంతో జాతీయ స్థాయిలో వారి ప్రాబల్యం ప్రశ్నార్థకంగా మారింది.

జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు కింగ్ మేకర్‌గా వ్యవహరించిన వామపక్షాలు, 2004లో 60కి పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుని యూపీఏ ప్రభుత్వంపై పట్టు సాధించాయి. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మద్దతు ఉపసంహరించుకోవడం ద్వారా దేశ రాజకీయాలను మలుపు తిప్పారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడం, యువతను ఆకట్టుకోలేకపోవడం, క్షేత్రస్థాయిలో కేడర్ చెల్లాచెదురు కావడంతో నేడు ఆ పార్టీల అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ఒకప్పటి వెలుగు మసకబారి, కేవలం నామమాత్రపు ఉనికికి పరిమితమయ్యే పరిస్థితి రావడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisment
తాజా కథనాలు