/rtv/media/media_files/2025/01/20/KxJ6vAaMlfBSuUxYxBmH.jpg)
Plastic Container
వేగంగా మారుతున్న ఆధునిక జీవనశైలిలో.. ప్లాస్టిక్ కంటైనర్లలో (డబ్బాలలో) భోజనం లేదా ఇతర ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం, లేదా వాటిని మైక్రోవేవ్‌లో వేడి చేయడం అనేది చాలా మంది రోజువారీ అలవాటుగా మారింది. ఈ సౌలభ్యం ఎంత ప్రమాదకరమనే విషయాన్ని అనేక శాస్త్రీయ అధ్యయనాలు, వైద్య పరిశోధనలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్‌తో ఆహారం సంపర్కం అయినప్పుడు.. ముఖ్యంగా వేడి చేసినప్పుడు.. అది మన శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీసే హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
విష రసాయనాలు:
ప్లాస్టిక్ కంటైనర్లలో ప్రధానంగా ఉండే హానికరమైన రసాయనాలు రెండు ఉన్నాయి. బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ (Phthalates). BPA -థాలేట్స్ అనే ఈ రసాయనాలు ఆహారంలోకి ఇంకి.. శరీరంలోకి ప్రవేశిస్తాయి. అధ్యయనాల ప్రకారం.. BPA అనేది ఒక ఎండోక్రైన్ డిస్రప్టర్ (హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే పదార్థం). ఇది శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను అనుకరించి.. హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.
ఆనారోగ్య సమస్యల ప్రమాదం:
పురుషులలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, గర్భధారణ సమస్యలు (వంధ్యత్వం) వంటి పునరుత్పత్తి సమస్యలు. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు. ఇవి ప్లాస్టిక్ నుంచి విడుదలైన విష పదార్థాలు రక్తప్రసరణను దెబ్బతీసి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (గుండె వైఫల్యం) ప్రమాదాన్ని పెంచుతాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి: పురుషుల్లో ఆ విషయం తగ్గుతుంది అంట.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
వేడి ఆహారం- మైక్రోవేవ్:
చాలా మంది వేడి వేడి ఆహారాన్ని నేరుగా ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేస్తారు లేదా ఆఫీసుల్లో మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేసుకుంటారు. ఈ అలవాటు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి, ప్లాస్టిక్ రసాయన నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల హానికరమైన రసాయనాలు, ముఖ్యంగా BPA, మైక్రోప్లాస్టిక్‌లు (Microplastics), ఆహారంలోకి విడుదలయ్యే రేటు అనేక రెట్లు పెరుగుతుంది. కంటైనర్‌పై మైక్రోవేవ్ సేఫ్ అని లేబుల్ ఉన్నప్పటికీ.. దానిని ఆహారం వేడి చేయడానికి ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే వేడి అనేది ఏదో ఒక స్థాయిలో రసాయనాలను విడుదల చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించినప్పుడు 95% వరకు రసాయనాలు విడుదలవుతాయి.
పిల్లలు-గర్భిణులకు అధిక ప్రమాదం:
ప్లాస్టిక్ రసాయనాలు (BPA వంటివి) అభివృద్ధి చెందుతున్న మెదడు, హార్మోన్ల వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి కాబట్టి పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఈ ప్రమాదం మరీ ఎక్కువ. ఇది పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీల పిండం (Fetus) అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఇతర సూచనలు:
ప్యాక్ చేసిన ఆహారాన్ని, ప్లాస్టిక్ బాటిళ్లను వాడటం తగ్గించి.. తాజా ఆహారాన్ని, స్టీల్ లేదా రాగి బాటిళ్లను ఉపయోగించడం ఉత్తమం. అంతేకాకుండా ప్లాస్టిక్ కంటైనర్లకు గీతలు పడితే లేదా పగుళ్లు ఏర్పడితే.. వాటిని వెంటనే పారవేయాలి. ఎందుకంటే పాడైన ప్లాస్టిక్ నుంచి మరింత ఎక్కువ రసాయనాలు విడుదలవుతాయి. సౌకర్యం కోసం ఆరోగ్యంతో రాజీ పడకుండా.. స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్లను ఎంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని.. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మధుమేహ బాధితులకు శుభవార్త.. భారత్‌లోకి ఒజెంపిక్
Follow Us