US IranPeace Deal : అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం...హర్షం వ్యక్తం చేసిన అంతర్జాతీయ సమాజం

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించుతూ కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని అంతర్జాతీయ సమాజం ఏకగ్రీవంగా స్వాగతించింది. నెలల తరబడి ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేసిన పశ్చిమాసియా సంక్షోభానికి ఈ డీల్‌తో శుభం కార్డు పడింది.

New Update
FotoJet - 2026-06-15T084129.909

US-Iran Peace Deal

US IranPeace Deal : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించుతూ కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని అంతర్జాతీయ సమాజం ఏకగ్రీవంగా స్వాగతించింది. నెలల తరబడి ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేసిన పశ్చిమాసియా సంక్షోభానికి ఈ డీల్‌తో ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఈ ఒప్పందం అంతర్జాతీయ దౌత్యరంగంలోనే ఒక అద్భుతమైన మలుపని, ప్రాంతీయ స్థిరత్వానికి, అంతర్జాతీయ ఆర్థిక రంగానికి ఇది ఎనలేని ఊరటనిస్తుందని ప్రపంచ దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేశారు. చమురు రవాణాకు అత్యంత వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) తిరిగి తెరుచుకోనుండటం ఈ ఒప్పందంలో అతిపెద్ద పరిణామంగా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి పాకిస్థాన్ ప్రధానంగా మధ్యవర్తిత్వం వహించగా.. ఖతార్, టర్కీ, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి ప్రపంచ అగ్రదేశాలు ఈ శాంతి పయనాన్ని మనస్ఫూర్తిగా అభినందించాయి.

‘షిప్స్ స్టార్ట్ చేయండి’: డొనాల్డ్ ట్రంప్ ఉత్సాహం

ఈ చారిత్రాత్మక ఒప్పందం విజయవంతంగా పూర్తయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా అధికారికంగా ప్రకటించారు."ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. ఈ ప్రక్రియలో భాగమైన అందరికీ అభినందనలు! ప్రపంచ నౌకలారా, మీ ఇంజన్లు స్టార్ట్ చేయండి.. ఆయిల్ ప్రవహించనివ్వండి!"అంటూ ట్రంప్ అత్యంత ఉత్సాహంగా సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో ఇరాన్‌పై ఉన్న నావికా దళ దిగ్బంధనాలు ముగియనున్నాయి.

జూన్ 19న అధికారిక సంతకాలు: పాక్ ప్రధాని వెల్లడి

ఈ అంతర్జాతీయ శాంతి చర్చల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ డీల్‌కు సంబంధించిన మరికొన్ని వివరాలను పంచుకున్నారు. తీవ్రమైన చర్చల అనంతరం ఇరుపక్షాలు లెబనాన్‌తో సహా పశ్చిమాసియాలోని అన్ని రకాల సైనిక చర్యలను శాశ్వతంగా ముగించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. వచ్చే శుక్రవారం అంటే జూన్ 19న స్విట్జర్లాండ్‌లో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయని వెల్లడించారు. ఈ క్లిష్టమైన దౌత్య ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలకు ప్రధాని షరీఫ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


 
ఖతార్(షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహమాన్) : ఈ అవగాహన ఒప్పందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. భవిష్యత్తు చర్చలు కూడా ఇదే సానుకూల వాతావరణంలో సాగాలి. మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ పాత్ర అభినందనీయం.

టర్కీ(తయ్యిప్ ఎర్డోగాన్) : ఈ పరిణామం ఒక చారిత్రాత్మక విజయం. ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ శుభవార్త, పశ్చిమాసియాలో శాశ్వత ప్రాంతీయ శాంతికి దారితీస్తుందని ఆశిస్తున్నాను.

బ్రిటన్ (కీర్ స్టార్మర్) : యుద్ధాన్ని ముగించడానికి, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇదొక కీలక అడుగు. అయితే ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని పొందకూడదు. జలసంధిలో మైన్లను తొలగించేందుకు బ్రిటన్ సహకరిస్తుంది.

జర్మనీ (ఫ్రెడరిక్ మెర్జ్) : ఈ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి, మిడిల్ ఈస్ట్‌లో పూర్తి స్థాయి రక్షణ, భద్రత పెరగడానికి ఎంతగానో దోహదపడుతుంది.

ఫ్రాన్స్ (ఇమ్మాన్యుయేల్ మాక్రాన్) : హోర్ముజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా తక్షణమే తెరవాలి. సముద్ర రవాణా పునరుద్ధరణకు ఫ్రాన్స్, బ్రిటన్‌లు మద్దతు ఇస్తాయి. ఇరాన్ అణు, బాలిస్టిక్ కార్యక్రమాలపై మరిన్ని చర్చలు జరగాలి.

ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయంగా చమురు సంక్షోభం గట్టెక్కనుండటమే కాకుండా, నౌకాయాన రంగానికి భారీ భద్రత లభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ అమెరికా-ఇరాన్ తీసుకున్న ఈ ముందడుగును ప్రశంసిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు