/rtv/media/media_files/2025/02/04/tmw7190Piw6k0YwWKvKw.jpg)
trump-musk
అమెరికాలో ఫెడరల్ ఉద్యోగులు ప్రస్తుతం మొర్రోమని ఏడుస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రధాన సలహాదారుడు ఎలాన్ మస్క్ కలిసి తమ ఉద్యోగాలు పీకేస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో ఫెడరల్ అంటే కేంద్రం అని చెప్పుకోవచ్చును. అంటే అక్కడ కేంద్ర ఉద్యోగుల జాబ్స్ పోతున్నాయి అన్నమాట. ఇప్పటివరకు 9,500మంది ఉద్యోగులపై వేటు పడింది. మరింత మంది లైన్లో ఉన్నారు. దేశం మొత్తం మీద 75 వేలమందికి స్వచ్చందంగా ఉద్యోగ విరమణ చేయాలని ట్రంప్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
రెండేళ్ళలోపు వారి ఉద్యోగాలు హుష్ కాకి..
ట్రంప్, ఎలాన్ మస్క్ కలిసి చేస్తున్న ఈ పని ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది. దేశంలో అనేక రంగాల్లో రెండేళ్ల కంటే తక్కవ కాలం పని చేసినవారి జాబ్స్ పోతున్నాయి. అలా కాకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే కొన్ని నెలల పాటూ జీతం ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ కొన్ని రోజుల క్రితం ఫెడరల్ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగాలు పోయినవారిలో ఫెడరల్ భూముల వ్యవహారాలు చూసే కార్మికులు, మిలిటరీ ప్రముఖుల కేర్‌లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా ఇంటీరియర్ డిపార్ట్‌మెంట్లు, ఎనర్జీ, వెటరన్స్ అఫైర్స్, వ్యవసాయం, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ట్రంప్ నిర్ణయంతో ఫెడరల్ ఉద్యోగులు షాక్ కు గురైయ్యారు. తమను తమ దేశమే మోసం చేసిందని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు పోయిన వారిలో చాలా మందికి వేరే కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఈ ఉద్యోగాల తొలగింపు అక్కడ ఉండే హోంల్యాండ్ సెక్యూరిటీ, నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ లాంటి పెద్ద ఫెడరల్ ఏజెన్సీల ప్రభావం చూపించనుంది. ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సి సమయం వచ్చేసిందని ఎలాన్ మస్క్ అంటున్నారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా మార్చాలని...దాని కోసం ఈ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ఇంతకంటే మార్గం లేదని మస్క్ అంటున్నారు. చాలా ఫెడరల్ ఏజెన్సీలను సామూహికంగా మూసివేయక తప్పదని చెప్పారు. ఇందులో లా ఎన్‌ఫోర్స్‌మెంట్, నేషనల్ సెక్యూరిటీ , ఇమ్మిగ్రేషన్ విభాగాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
అమెరికాలో మొత్తం 23 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా పలు ఏజెన్సీల్లో పని చేస్తున్నారు. ఈ ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా అమెరికా 36 ట్రిలియన్ డాలర్ల అప్పును కలిగి ఉంది. గత ఏడాది 1.8 ట్రిలియన్ డాలర్ల లోటును ఫేస్ చేసింది.