/rtv/media/media_files/2026/02/18/sri-lanka-2026-02-18-16-30-04.jpg)
Sri Lanka Scraps Lawmaker Pensions
శ్రీలంక(srilanka) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీలకు ఇచ్చే పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును మంగళవారం పార్లమెంటులో ఆమోదించింది. ఈ సభలో 225 మంది సభ్యులు ఉండగా... 154 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. మిగతా సభ్యులు ఓటు వేయలేదు. ప్రస్తుతం చూసుకుంటే శ్రీలంకలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఎంపీ(mp) లకు పెన్షన్ అందుతోంది. కొత్త చట్టం పార్లమెంటులో ఆమోదం పొందడంతో అందరికీ ఈ పెన్షన్లు నిలిచిపోనున్నాయి. అంతేకాదు దిసనాయకే సర్కార్ అధికారంలోకి వచ్చాక మాజీ అధ్యక్షులకు ఇచ్చే ప్రయోజనాలను కూడా నిలిపివేసింది.
శ్కీలంకకు పర్యాటక రంగంతోనే ఎక్కువగా ఆదాయం వస్తుంది. అయితే కరోనా, ఉగ్రదాడుల కారణంగా పర్యాటకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణ లోపం కూడా ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో 2022లో శ్రీలంక ప్రభుత్వం దివాళా తీసింది. ఆ దేశంలో ఆహారం, విద్యుత్, చమురు, ఔషధాలపై తీవ్రంగా సంక్షోభం నెలకొంది. ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చివరికి అప్పటికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మార్క్సిస్టు నేత దిసనాయకే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ల రద్దుకు బిల్లును తీసుకొచ్చారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉండగా ఎంపీలకు పెన్షన్లు తీసుకునే నైతికత లేదని అక్కడి న్యాయశాఖ మంత్రి హర్షణ నానాయక్కర బిల్లుపై చర్చ సందర్భంగా విమర్శించారు.
Also Read: ముస్లింలకు సర్కార్ బిగ్ షాక్.. రంజాన్ ప్రారంభ వేళ 5శాతం రిజర్వేషన్ రద్దు
భారత్‌లో ఎంపీల పెన్షన్లు ఎంత ?
భారత్‌లో ఒక వ్యక్తి ఎంపీ పదవిలో ఒక్క రోజు ఉన్నా కూడా అతనికి లేదా ఆమెకు నెలకు రూ.31,000 పెన్షన్ వస్తుంది. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎంపీగా ఉంటే అదనంగా ప్రతినెలా రూ.2500 చొప్పున పెన్షన్ వస్తుంది. ఒకవేళ మాజీ ఎంపీ మరణిస్తే వాళ్ల జీవిత భాగస్వామికి లేదా డిపెండెంట్లకు ఎంపీ పొందే పెన్షన్‌లో 50 శాతం అందుతుంది. మరోవైపు ఎమ్మెల్యేల పెన్షన్ అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఉంటుంది. తెలంగాణ, ఏపీలో కనీసం రూ.30,000 నుంచి ప్రారంభమై సర్వీసును బట్టి రూ.50,000 పైగా ఉంటుంది. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పెన్షన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పలు సందర్భాల్లో రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటుంది.
అంతేకాదు భారత్‌లో మాజీ ఎంపీలకు పెన్షన్(pension) తో పాటు ట్రైన్లలో ఉచిత ప్రయాణం, వైద్య సౌకర్యాలు (CGHS) వంటి సేవలు కూడా లభిస్తాయి. భారత్‌లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేయాలని సామాజిక కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. చట్టసభలకు వెళ్లినవారికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు పదవిలో లేనప్పుడు ఈ పెన్షన్ గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. మరీ భవిష్యత్తులోనైనా ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేసే బిల్లు వస్తుందా ? రాదా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
Also Read: మోదీ ధరించిన ఆ స్మార్ట్ గ్లాసెస్.. చూస్తే రాస్తుంది, చెప్తే వింటోంది
Follow Us