/rtv/media/media_files/2026/04/13/britain-and-france-2026-04-13-21-48-24.jpg)
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, నార్త్ అట్లాంటిక్ సంధి సంస్థ (NATO) సభ్య దేశాలకు మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరిని బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి.
యుద్ధం ముంగిట ఒంటరైన ట్రంప్?
ఇరాన్‌పై అమెరికా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, నాటో నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు. గతంలో కనీసం వైమానిక స్థావరాలను ఇచ్చేందుకు కూడా బ్రిటన్ నిరాకరించడం గమనార్హం. దీనిపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాటోను "పిరికి నాటో" అని అభివర్ణించడమే కాకుండా, "అమెరికా సాయం లేకుండా నాటో మనుగడ సాగించగలదా?" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ దిగ్బంధంలో అనేక దేశాలు తనతో కలిసొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేసినప్పటికీ, కీలకమైన బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రం తాము అందులో భాగం కాబోమని తేల్చిచెప్పాయి.
బ్రిటన్, ఫ్రాన్స్ కొత్త వ్యూహం
ట్రంప్ ప్లాన్‌కు భిన్నంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించేందుకు ఒక "శాంతియుత మిషన్" చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ వారం బ్రిటన్ వేదికగా ఒక ప్రత్యేక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ ప్రణాళికలో చేరాలని దాదాపు 40కి పైగా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. అమెరికా దిగ్బంధనానికి సంబంధం లేకుండా, స్వతంత్రంగా వ్యవహరించాలని ఈ దేశాలు నిర్ణయించుకున్నాయి.
అమెరికాకు గట్టి దెబ్బేనా?
అన్ని దేశాల మద్దతుతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని భావించిన ట్రంప్‌కు, నాటో దేశాల నిర్ణయం కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. "మిత్రదేశాలతో కలిసి శాంతియుత మార్గంలో ముందుకెళ్తాం" అని మాక్రాన్ చేసిన ప్రకటన, ట్రంప్ యుద్ధ తంత్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. నాటో కూటమికి, ట్రంప్ నాయకత్వానికి మధ్య పొసగడం లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అగ్రరాజ్యం మాటను పక్కనపెట్టి యూరప్ దేశాలు సొంత దారి వెతుక్కోవడం భవిష్యత్తులో అంతర్జాతీయ సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.
Follow Us