Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

New Update
airways

ఇండిగో విమానయాన సంస్థ(DGCA On IndiGo Flight) ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి. అంతేకాదు నడిచే రెండు మూడు ఫ్లైట్లు కూడా గంటల గంటల ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. దీంతో కేవలం 7 రోజుల్లో (డిసెంబర్ 1 నుండి 8 వరకు) ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు ధరలు భారీగా పడిపోవడం వల్ల, సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి సుమారు ₹37,000 కోట్ల నుండి ₹38,000 కోట్లకు పైగా ($4.2 బిలియన్లకు పైగా) పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఇలాంటి సమయంలో ఇండిగో(flight indigo) సంస్థ మనుగడ అగమ్యగోచరంగా ఉంది. గతంలో కూడా ఇండియాలో 3 ఎయిర్‌లైన్స్ మూతపడ్డాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం..

Also Read :  రెండో రోజూ బేర్ విలవిల.. 400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

విజయ్ మాల్యా కింగ్ ఫిషర్

విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్(kingfisher) ఎయిర్‌లైన్స్ ఇండియాలో అద్భుతంగా వ్యాపారం చేసింది. 2003లో దీన్ని స్థాపించగా.. మే 9, 2005 నాడు ముంబై నుంచి ఢిల్లీకి తన తొలి వాణిజ్య విమానాన్ని నడిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లగ్జరీ సర్వీసెస్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు, ఉన్నత స్థాయి భోజనం, ప్రీమియం లాంజ్‌లను అందించింది. ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద దేశీయ విమాన మార్కెట్ వాటాను కలిగి ఉండేది. 2007లో కింగ్‌ఫిషర్... ఎయిర్ డెక్కన్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు సంస్థపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపింది.

నిరంతరంగా నష్టాలు రావడం, విమాన నిర్వహణ ఖర్చులు, లీజు అద్దెలు పెరిగిపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వివిధ బ్యాంకుల నుండి సుమారు రూ.9,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, వాటిని చెల్లించడంలో విఫలమైంది. ఉద్యోగులకు జీతాలు, విమాన లీజు అద్దెలు చెల్లించలేకపోయింది. దీంతో 2012 అక్టోబర్‌లో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. 2013 ఫిబ్రవరిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ విమానయాన లైసెన్స్‌ను రద్దు చేసింది. సంస్థ పతనానికి కారణమైన విజయ్ మాల్యా, వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి, దేశం విడిచి లండన్‌కు పారిపోయారు.

జెట్ ఎయిర్‌వేస్ 

జెట్ ఎయిర్‌వేస్ భారతదేశంలో ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రధానమైన ఫుల్-సర్వీస్ విమానయాన సంస్థగా వెలుగొంది. కానీ తీవ్ర ఆర్థిక, నిర్వహణ సమస్యల కారణంగా 2019లో మూతబడింది. ప్రముఖ వ్యాపారవేత్త నరేష్ గోయల్ జెట్ ఎయిర్‌వేస్‌ను 1992లో స్థాపించారు. 1993లో ఇది దేశీయ విమాన సేవలను ప్రారంభించింది. కింగ్‌ఫిషర్ కంటే ముందే, జెట్ ఎయిర్‌వేస్ భారతదేశంలో నాణ్యమైన, ఫుల్-సర్వీస్ ప్రయాణ అనుభవాన్ని అందించడంలో అగ్రగామిగా ఉంది. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండేది. ఇండిగో వంటి తక్కువ-ధర విమానయాన సంస్థల నుండి వచ్చిన పోటీని తట్టుకోలేక, ప్రీమియం సేవలను నిర్వహించడానికి జెట్ ఎయిర్‌వేస్ అధికంగా ఖర్చు చేసింది. సంస్థ నిర్వహణ ఖర్చులు, ఇంధన ధరలు, లీజు అద్దెల కారణంగా సుమారు రూ.8,000 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోయాయి. తీవ్రమైన నగదు కొరత, రుణ సంక్షోభం కారణంగా 2019 ఏప్రిల్ 17న జెట్ ఎయిర్‌వేస్ తన అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. సంస్థ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను అరెస్ట్ చేశారు.

Also Read :  ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

గోఎయిర్ / గోఫస్ట్ 

గోఎయిర్ ఆ తర్వాత గోఫస్ట్‌గా పేరు మార్చుకుంది. దీన్ని 2004లో వాడియా గ్రూప్‌కు చెందిన నస్లీ వాడియా, అతని కుమారుడు జే వాడియాలు స్థాపించారు. 2005 నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది తక్కువ-ధర విమానయాన సంస్థగా పనిచేసింది. ఇండిగో, స్పైస్‌జెట్‌లతో పోటీ పడింది. మార్కెటింగ్‌ను మెరుగుపరచడానికి, అంతర్జాతీయంగా విస్తరించే లక్ష్యంతో 2021లో దీని పేరును గోఎయిర్ నుండి గోఫస్ట్ గా మార్చారు. గోఫస్ట్ తన కార్యకలాపాలను మే 2023లో పూర్తిగా నిలిపివేసి, దివాలా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకుంది. గోఫస్ట్ విమానాలకు ఉపయోగించిన అమెరికన్ కంపెనీ తయారు చేసిన ప్ర్యాట్ అండ్ విట్నీ ఇంజిన్లలో పదేపదే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇంజిన్లలో సమస్యల కారణంగా, విమానాలను నడపడానికి వీలు లేక, సుమారు సగం కంటే ఎక్కువ విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు