/rtv/media/media_files/2026/04/11/police-fire-2026-04-11-18-00-26.jpg)
Serial shootings against suspects in AP
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో నిందితులపై పోలీసుల కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎంచుకున్న ట్రీట్‌మెంటా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన రెండు ఘటనలు కూడా ఒకే రీతిలో ఉండటం, నిందితులు ఇద్దరూ పోలీసులపై తిరగబడటం ప్రతీగా పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపాయి. అయితే ఈ ఘటనలు నేరం చేయాలనుకునే వారికి కొంత భయాన్ని కలిగిస్తాయోమో కానీ, జరుగుతున్న నేరాలను అరికడుతా అనే సందేహం వ్యక్తమవుతుంది. నిజానికి గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరిగిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
Also Read : విజయవాడలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలేసిన మహిళ
మైనర్ బాలిక హత్య కేసులో...
కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన అనే మైనర్ బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. తనను ప్రేమించడం లేదని ఉన్మాదిగా మారిన వెంకటేశ్ అనే యువకుడు, కీర్తన గొంతు కోసి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ అమానుష ఘటన అనంతరం నిందితుడు పారిపోగా పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో వెంకటేష్ గాయపడ్డాడు. బసాపురం చెక్‌పోస్ట్ వద్ద సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పారిపోయే క్రమంలో బసాపురం చెక్‌పోస్ట్ దగ్గర నిందితుడు వెంకటేష్ పోలీసులకు ఎదురయ్యాడు. పోలీసులు అతడిని చుట్టుముట్టారు, లొంగిపోవడానికి నిరాకరించిన వెంకటేష్ పోలీసులపైనే దాడికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం, నిందితుడు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు మొదట గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా వెంకటేష్ లొంగకపోవడంతో నేరుగా కాల్పులు జరపగా కాల్పుల్లో వెంకటేష్ కాలికి గాయమైంది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Also Read : మోహన్ బాబుకు ఊరట... తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు
బావమరిదిని చంపిన కేసులో...
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోనూ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపిన కసాయి బావ సర్వేష్ పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో ఏడేళ్ల బాలుడు హేమచంద్రను డబ్బు కోసం సొంత బావ సర్వేష్ కిడ్నాప్ చేసి అనంతరం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి హత్య చేశాడు.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సర్వేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా..సర్వేష్ పారిపోయేందుకు యత్నించాడు. సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌పై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ సమయంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందులో నాలుగు రౌండ్లు గాలిలోకి.... జరిపినప్పటికీ సర్వేశ్ వినకపోవడంతో రెండు రౌండ్లు మోకాళ్ల కిందకు కాల్చారు. దీంతో నిందితుడు సర్వేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు.
ఈ రెండు ఘటనల్లోనూ పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తుండగా, ఘటనలు జరిగినపుడు పోలీసులు ట్రీట్‌మెంట్ ఇవ్వడం కాకుండా నేరాలను అదుపు చేయడంలో చొరవ చూపితే ఇలాంటి నేరాలు జరగకుండా ఉంటాయన్న వాదన వినవస్తోంది.
Follow Us