Year Ender 2024: బీఆర్ఎస్ పార్టీకి ఈ 2024 ఏడాది తీవ్ర నిరాశను మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. ఊహించని అనేక ఎదురు దెబ్బలను ఆ పార్టీ ఎదుర్కొంది.
బయటకు రాని కేసీఆర్:
కేసీఆర్ ఈ ఏడాది పెద్దగా బయటకు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. బిడ్డ కవిత అరెస్ట్ అయిన సందర్భంలోనూ ఆయన బయటకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది వ్యూహాత్మక మౌనమని బీఆర్ఎస్ చెబుతుంటే.. కేసీఆర్ పని ఖతమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ ఏడాది అయినా కేసీఆర్ బయటకు వస్తారా? ప్రజా క్షేత్రంలో మళ్లీ యాక్టీవ్ అవుతారా? అన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది.
కవిత అరెస్ట్..
అసలే ఓటమితో పాటు కేసీఆర్ అనారోగ్యంతో పుట్టెడు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కవిత అరెస్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను మార్చి 12న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 165 రోజులు ఆమె జైలు జీవితం గడిపి బెయిల్ పై ఆగస్టు 27న విడుదలయ్యారు.
ఎంపీ ఎన్నికల్లో దారుణ పరాజయం:
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ సైతం బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి తొలిసారిగా ఆ పార్టీ లోక్ సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది.
Also Read: న్యూ ఇయర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు! ఆ దేశ ప్రజలు ఎందుకలా చేస్తారు?
ఎమ్మెల్యేలు జంప్:
రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, డా.సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. వీరితో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, దండె విఠల్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్ తదితరులు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.
Also Read: కొందరు గర్వంగా, మరికొందరు భారంగా: 2024 దిగ్గజాల వీడ్కోలు!
వరుస కేసులు:
రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ సర్కార్ హయంలో జరిగిన వివిధ కార్యక్రమాలపై కమిషన్లు వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాళేశ్వరం, పవర్ కమిషన్ల విచారణ కొనసాగుతోంది. వచ్చే నెలలో కేసీఆర్, హరీశ్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
ఫార్ములా-ఈ రేసులో కేటీఆర్:
గత ఎన్నికల్లో పార్టీ ఓటమి నాటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. అయితే.. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ ఆయనను A1గా నమోదు చేసింది. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 31వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆశ్రయించింది. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.