Road Accident : టాలీవుడ్‌లో విషాదం...యువహీరో..సినిమాటోగ్రాఫర్ మృతి

సినీ పరిశ్రమలో రాణించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఇద్దరు యువ ప్రతిభావంతుల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ ORR పై జరిగిన ఘోర ప్రమాదంలో యువహీరో కత్తి భరత్ కాంత్, యువ సినిమాటోగ్రాఫర్ గూడ సాయి త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు.

New Update
FotoJet - 2026-05-11T071453.377

Bharat Kant , Trilok

Road Accident :  సినీ పరిశ్రమలో రాణించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఇద్దరు యువ ప్రతిభావంతుల ప్రయాణం రోడ్డు ప్రమాదం రూపంలో అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో వర్ధమాన సినీ నటుడు కత్తి భరత్ కాంత్ (31), యువ సినిమాటోగ్రాఫర్ గూడ సాయి త్రిలోక్ (31) దుర్మరణం చెందడం చిత్ర పరిశ్రమతో పాటు వారి స్వస్థలంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పట్టణానికి చెందిన కత్తి మోహనరావు, జయలక్ష్మిల కుమారుడు భరత్ కాంత్, అలాగే అదే ప్రాంతానికి చెందిన గూడా మాల్యాద్రి శర్మ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయి త్రిలోక్ ప్రాణస్నేహితులు. సినీ పరిశ్రమపై ఉన్న మక్కువతో, ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించాలనే పట్టుదలతో పదేళ్ల క్రితమే వీరిద్దరూ హైదరాబాద్‌కు వచ్చారు. గచ్చిబౌలి సమీపంలోని నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నారు.

ఇటీవలే విడుదలైన 'టెనెంట్' (Tenant) అనే సినిమాలో భరత్ కాంత్ హీరోగా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేశారు. మరోవైపు త్రిలోక్ టాలెంటెడ్ కెమెరామ్యాన్‌గా (సినిమాటోగ్రాఫర్) పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటూ, పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర ప్రాజెక్టులకు పని చేస్తున్నారు.ఇటీవలే వీరిద్దరూ కలిసి సొంతూరైన నెల్లూరుకు వెళ్లారు. శనివారం రాత్రి నెల్లూరు నుంచి తమ సొంత కారులో హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పెద్దఅంబర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌ (ORR) ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఘోర ప్రమాదం సంభవించింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధిలోని బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్దకు రాగానే.. అతివేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
 
ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే, కారు ముందు భాగం కంటైనర్ కిందకు దూసుకుపోయి పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారును నడుపుతున్న భరత్ కాంత్‌తో పాటు పక్కనే కూర్చున్న త్రిలోక్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్ బి. రవికుమార్, ఎస్సై నోయల్ రాజ్ తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నుజ్జునుజ్జైన కారు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసి, శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం మృతుల ఫోన్లు, కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న ఇద్దరు యువ కశాకారులు ఇలా ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినీ రంగంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. పలువురు సినీ ప్రముఖులు, నటులు సామాజిక మాధ్యమాల వేదికగా వీరికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. స్నేహితులుగా కెరీర్ ప్రారంభించి, చివరి ప్రయాణంలోనూ కలిసే అనంత లోకాలకు వెళ్లిపోవడం వారి సన్నిహితులను కలచివేస్తోంది.

Advertisment
తాజా కథనాలు