Suicide : కూకట్‌పల్లిలో విషాదం... ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య..

హైదరాబాద్‌ కూకట్‌పల్లి కుమ్మరిబస్తీకి చెందిన యంజాల కార్తీక్‌ (28), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మంజుల అలియాస్‌ జ్ఞానసిక (27)లు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నెలన్నరకే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

New Update
FotoJet - 2026-05-03T070135.817

New couple suicide

Suicide : హైదరాబాద్‌ కూకట్‌పల్లి కుమ్మరిబస్తీకి చెందిన యంజాల కార్తీక్‌ (28), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మంజుల అలియాస్‌ జ్ఞానసిక (27)లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించారు. ఈ ఏడాది మార్చి 8న అట్టహాసంగా వీరి పెళ్లి జరిగింది. కార్తీక్ ఐటీసీ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా, మంజుల ఆర్కిటెక్ట్‌గా పనిచేసేవారు. పెళ్లయిన నెలన్నర రోజులుగా ఈ నవ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

శుక్రవారం రాత్రి ఈ జంట కూకట్‌పల్లిలో జరిగిన ఒక విందుకు హాజరయ్యారు. అక్కడ అందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాక కూడా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో కూడా వారి మధ్య ఎలాంటి గొడవలు జరిగినట్లు గానీ, వారు ఒత్తిడిలో ఉన్నట్లు గానీ కనిపించలేదు. భోజనం ముగిసిన తర్వాత కార్తీక్, మంజుల మొదటి అంతస్తులోని తమ గదిలోకి వెళ్లారు.శనివారం ఉదయం 11:30 దాటినా కార్తీక్ గది నుంచి బయటకు రాకపోవడంతో పాటు, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. కార్తీక్ వెంటిలేటర్‌కు ఉరేసుకుని ఉండగా, మంజుల నోటి వెంట నురగలు కక్కుతూ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉంది. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంజుల విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ దంపతుల మరణానికి గల కారణాలు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. కార్తీక్‌ది ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ ఇంట్లో ఎలాంటి కలహాలు లేవని బంధువులు చెబుతున్నారు. మంజుల తల్లిదండ్రులు సైతం తమ కుమార్తె చాలా ధైర్యవంతురాలని, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు గానీ, ఇతర గొడవలు గానీ కనిపించకపోవడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్ట్‌మార్టం నివేదిక, ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పెళ్లయిన రెండు నెలలు కూడా గడవకముందే ఇద్దరు ఉన్నత విద్యావంతులు ఇలా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisment
తాజా కథనాలు