/rtv/media/media_files/2026/04/20/arjun-2026-04-20-07-27-05.jpg)
Koduri Chandrashekhar Azad alias Arjun
Social media : సోషల్ మీడియా వేదికగా యువతులను, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వంచిస్తున్న ఒక కిలాడీ మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23), తన మాయమాటలతో తెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లలో సుమారు 20 మందికి పైగా యువతులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి, అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నిందితుడు ఆజాద్ అనుసరించే నేర శైలి అత్యంత ప్రమాదకరంగా ఉంది. హైదరాబాద్‌లోని సంపన్న వర్గాల ఇళ్లలో పనిచేసే వాచ్‌మెన్లు, తోటమాలీలతో పరిచయాలు పెంచుకుని, ఆ ఇళ్లలోని అమ్మాయిల వివరాలు సేకరించేవాడు. అనంతరం సోషల్ మీడియాలో ఖరీదైన కార్లు, పబ్‌లలో దిగిన ఫోటోలను పంపి తాను కూడా పెద్ద ధనవంతుడినని నమ్మించేవాడు. అమ్మాయిలు తన వలలో పడగానే వారితో ఏకాంతంగా గడిపి, ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసేవాడు. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు.
జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక 15 ఏళ్ల బాలిక విషయంలో నిందితుడు ప్రదర్శించిన తెగింపు విస్తుగొలుపుతోంది. గతంలోనే ఈ బాలికపై వేధింపులకు పాల్పడి జైలుకు వెళ్లిన ఆజాద్, బయటకు వచ్చాక మళ్లీ ఆమెకు దగ్గరయ్యాడు. ఆ ఇంటి డ్రైవర్ కృష్ణ, అతని భార్య సరస్వతి సహకారంతో బాలికను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడితో పాటు డ్రైవర్ భార్య కూడా బాలికను బెదిరించడంతో, భయపడిన ఆ చిన్నారి తన ఇంట్లోనే రూ. 29 లక్షల నగదును చోరీ చేసింది. ఇందులో ఆజాద్‌కు రూ. 13 లక్షలు, డ్రైవర్ భార్యకు రూ. 10 లక్షలు ముట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అదేవిధంగా నార్సింగికి చెందిన మరో యువతిని కూడా ఆజాద్ దారుణంగా వంచించాడు. కాలేజీలో చేర్పించే నెపంతో ఆమెను గుంటూరుకు తీసుకెళ్లి హోటల్ గదిలో లొంగదీసుకున్నాడు. అనంతరం ఆ ఫోటోలతో బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలను కాజేశాడు. ఈ కేసుల దర్యాప్తు చేపట్టిన ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులురెడ్డి, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు యువతులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Follow Us