/rtv/media/media_files/2025/02/24/b3HMG82yI8vYePzih4F9.jpg)
SLBC history Photograph: (SLBC history)
9 మీటర్ల వ్యాసంతో.. 45 కిలో మీటర్లు, భూఉపరితలానికి 500 మీటర్ల లోతులో ఓ పెద్ద సొరంగం. దాని గుండా 3 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లా ప్రజలకు తాగునీరు అందాలి. దీనికోసం డిజైన్ చేయబడిందే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్(SLBC) ప్రాజెక్ట్. ఇది 40ఏళ్ల క్రితం నాటి ఆలోచన. ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. అసలు 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో.. SLBC ప్రాజెక్ట్‌లో ఎదురైనా సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1978లోనే తెరపైకి SLBC టన్నల్ ఆలోచన
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంతో పాటు ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు తగినంత నీటి వనరులు రావడం లేదని విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనిపై అప్పటి ప్రభుత్వాల్లో ప్రతిసారి ప్రతిపక్షం నుంచి సభ్యులు చర్చ చేసేవారు. నాగార్జునసాగర్‌కు ప్రత్యామ్నాయంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకువచ్చే ప్రతిపాదనలపై చర్చించాలని డిమాండ్స్ వెల్లువెతాయి. ఈ క్రమంలో 1978లో టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెనుకబడిన ప్రాంతాల ఇరిగేషన్ మీద చర్చ జరిగింది.
ఆనాటి ఇరిగేషన్ మంత్రి సుధాకర్ రావు నేతృత్వంలో శ్రీశైలం నుంచి నీటిని అందించడానికి సాధ్యాసాధ్యాలపై ఒక టెక్నికల్ కమిటీ వేశారు. ఈ టెక్నికల్ కమిటీ సర్వే జరిపిన అనంతరం శ్రీశైలం నుంచి మూడు లక్షల ఎకరాలకు టన్నెల్ ద్వారా నీరు అందించవచ్చని రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్టులోనే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగాన్ని 9 మీటర్ల వ్యాసంతో 45 కిలోమీటర్ల పొడవున 300 నుంచి 500 మీటర్ల దిగువన కొండలలో తవ్వాల్సి వస్తుందని ప్రతిపాదన చేశారు. దీని ఆధారంగానే శ్రీశైలం ఎడమ గట్టు నుండి సొరంగ మార్గం తెరపైకి వచ్చింది.
NTR కాలంలో ప్రత్యామ్నాయంగా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం
1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడి గట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. తర్వాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి.. ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టింది ప్రభుత్వం.
దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి...పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటితోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ.. సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకు వచ్చింది.
కాలువా కాకుండా సొరంగమే ఎందుకంటే..?
నీళ్లు తరలించే ప్రాంతం మొత్తం నల్లమల అటవీ అమ్రాబాద్ రిజర్వడ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఈ ప్రాజెక్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. ఓపెన్ కెనల్ తవ్వడానికి అటవి శాఖ అనుమతులు ఇవ్వదు. అందుకే సొరంగం తొవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు గ్రావిటీ పరంగా కూడా టన్నెల్ ద్వారానే నీటిని తరలించాలనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
43KM టన్నెల్ చాలా కీలకం
SLBC సొరంగ నిర్మాన పనులు 2005 ఆగస్టులో రూ.2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ప్రాజెక్టుకు సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయగా.. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. రెండుచోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది.
9.56KM టన్నెల్ తవ్వితే SLBC కంప్లీట్
శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా.. 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. సొరంగం రెండు వైపుల నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది.
ఉమ్మడి ఏపీలోనే 52 శాతం పనులు
డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది లక్ష్యం. దీనిద్వారా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా, కొనసాగుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో 23 శాతం పనులు జరిగాయని తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్దన్ తెలిపారు.