టాలీవుడ్‌ హీరోలకు MLA సవాల్.. డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే సినిమా రిలీజ్!

టాలీవుడ్‌ను టార్గెట్‌గా చేసుకొని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అది సినీ గ్లామర్ ప్రపంచం నుంచే మొదలవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

New Update
_Jadcharla MLA Anirudh Reddy

తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా హీట్ పెంచారు. టాలీవుడ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అది సినీ గ్లామర్ ప్రపంచం నుంచే మొదలవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తాను సారా గురించి మాట్లాడితే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిపై అనిరుధ్ రెడ్డి విరుచుకుపడ్డారు. సినిమాల్లో "మందుబాబులం మేం మందుబాబులం" అని పాటలు పాడితే చప్పట్లు కొట్టే జనం, సమాజ హితం కోరి తాను మాట్లాడితే ఎందుకు ఎగతాళి చేస్తున్నారని ప్రశ్నించారు. యువతను తప్పుదోవ పట్టించే అలవాట్లకు సినీ ఇండస్ట్రీ అద్దం పట్టకూడదని ఆయన హితవు పలికారు.

డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే థియేటర్లోకి!
సినిమా నటులపై డ్రగ్స్ విషయంలో సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ మూలాలు సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించిన ఆయన, సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చారు. "సినిమా నటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. రిపోర్టులో నెగెటివ్ వస్తేనే వారి సినిమాలను విడుదల చేయాలి. ఒకవేళ ఏ నటుడైనా టెస్టుకు నిరాకరిస్తే, వారి సినిమా విడుదల నిలిపివేయాలి" అని ఆయన కోరారు. 

షూటింగ్‌లకు పర్మిషన్ కావాలంటే అది ఉండాల్సిందే..
కేవలం సినిమా విడుదల మాత్రమే కాదు, షూటింగ్‌ల విషయంలోనూ ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి 90 రోజులకు ఒకసారి సినీ తారలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని, ఆ రిపోర్టులు సక్రమంగా ఉంటేనే షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. "సినిమా ఫీల్డ్‌లో డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ ముద్ర పోవాలంటే నటులు తమ నిజాయితీని నిరూపించుకోవాలి" అని ఆయన అన్నారు.

నేను రెడీ.. మీరు సిద్ధమేనా?
రాజకీయ నాయకులపై డ్రగ్స్ రూమర్లు తక్కువగా ఉన్నప్పటికీ, పారదర్శకత కోసం తాను ఇప్పటికే డ్రగ్ టెస్ట్ చేయించుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇదే పద్ధతిని ప్రజాప్రతినిధులందరికీ వర్తింపజేయాలని ఆయన కోరారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రజాప్రతినిధులు టెస్ట్ చేయించుకోవాలని, పరీక్షకు నిరాకరించే వారిని చట్టసభల్లోకి అడుగుపెట్టనివ్వకూడదని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శం!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి కొనియాడారు. "మా సీఎం రేవంత్ రెడ్డికి మందు తాగే అలవాటు లేదు, సిగరెట్ కూడా తాగరు. మా నాయకుడు డ్రగ్ అడిక్ట్ కాదు అన్నప్పుడు, మేం కూడా వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు