/rtv/media/media_files/2026/04/24/tgsrtc-issue-2026-04-24-21-34-52.jpg)
TGSRTC Issue
తెలంగాణలో RTC సమస్యల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ఇందులో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇక మిగిలిన మూడు కీలక డిమాండ్లపై మంత్రుల బృందం చర్చలు జరుపుతోంది. ఇందులో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు గుర్తింపు, పీఆర్‌సీ (PRC) అమలనే డిమాండ్లు ఉన్నాయి.
Also Read: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు !
అయితే బోర్డు పరిధిలోని సమస్యలను యాజమాన్యం చూసుకుంటుందని మంత్రులు JAC నేతలకు తెలిపారు. ప్రభుత్వ పరిధిలోని అంశాలను మాత్రం తాము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్టీసీ వ్యవస్థ చిన్నాభిన్నమైందని మండిపడ్డారు. గత పాలకులు కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా పాలనాపరంగా, విధానపరంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read: బీజేపీలో చేరిక.. RTVకి మల్లారెడ్డి కోడలు సంచలన ఇంటర్వ్యూ!
అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా పర్మినెంట్ పద్ధతిలో వేతనాలు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మీటింగ్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడంపై భట్టి విక్రమార్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Follow Us