Road accident : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం రాత్రి అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, ఒక స్పోర్ట్స్ బైక్ పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
FotoJet - 2026-05-11T075306.160

Fatal accident in Mahabubnagar district

Road accident : మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం రాత్రి అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, ఒక స్పోర్ట్స్ బైక్ పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకర దుర్ఘటన జిల్లా కేంద్రం సమీపంలోని పాలకొండ చౌరస్తా వద్ద బైపాస్ రహదారిపై సంభవించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ బైపాస్ రహదారిపై పాలకొండ చౌరస్తా వద్ద ఒక కారు యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అత్యంత వేగంతో దూసుకొస్తున్న ఒక స్పోర్ట్స్ బైక్, కారును  బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత చాలా బలంగా ఉండటంతో.. రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

 ఈ ఘోర ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలోనే ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనను చూసి స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మహబూబ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు.మృతుల వివరాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వారి సెల్‌ఫోన్లు, వాహనాల నంబర్ ప్లేట్ల ఆధారంగా మృతులు ఎక్కడి వారు? వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏమిటి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో బైపాస్ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామైంది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన కారు, స్పోర్ట్స్ బైక్ శిథిలాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

పాలకొండ చౌరస్తా వద్ద తరచూ వాహనాలు యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, బైపాస్ రోడ్డుపై వేగ నియంత్రణకు అవసరమైన చర్యలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల కుటుంబాల్లో తీరని శోకం వ్యక్తమవుతోంది. కాగా, మహబూబ్‌నగర్‌లో ప్రతిరోజు రాత్రి 11 దాటితే యువకులు బైక్‌ రేసులు నిర్వహిస్తున్నారని, రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో పలువురు యువకులు తమ ఇష్టరీతిన ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు