/rtv/media/media_files/2026/06/10/it-employees-were-caught-by-the-eagle-force-2026-06-10-17-45-12.jpg)
IT employees were caught by the Eagle Force
Eagle Force : గంజాయి మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్న 'ఈగల్ ఫోర్స్' (Eagle Force) తాజాగా నానక్‌రామ్‌గూడ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఐటీ హబ్‌గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగుతున్న గంజాయి నెట్‌వర్క్‌ను టార్గెట్ చేస్తూ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో కిరాణా షాప్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న -లక్షల రూపాయల గంజాయి దందా వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది.
ధూల్‌పేట్ ప్రాంతం నుండి వచ్చి ఐటీ కోర్ ఏరియా అయిన నానక్‌రామ్‌గూడలో అడ్డా పెట్టిన లేడీ డ్రగ్ డాన్ 'నీతూ భాయ్' ఈ అక్రమ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. బయటి ప్రపంచానికి మాత్రం ఆమె ఓ సాధారణ కిరాణం షాపు నడుపుతున్నట్టు నమ్మిస్తూ కలరింగ్ ఇచ్చేది. అయితే ఆ షాపు మాటున రోజుకు సుమారు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ నిఘా విభాగం పక్కా ఆధారాలతో నిరూపించింది.
ఈ దందా అంతా ప్రధానంగా నగరంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సాగుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ పరిసరాల్లోని ప్రముఖ మల్టీనేషనల్ (MNC) కంపెనీల్లో, ముఖ్యంగా లండన్, యూఎస్ క్లయింట్లతో పనిచేసే నైట్ షిఫ్ట్ ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. గంజాయి కొనుగోలు కోసం నిత్యం ఐటీ ఎంప్లాయిస్ నీతూ భాయ్ ఇంటి ముందు, షాపు వద్ద క్యూ కట్టడం గమనార్హం.
పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందాలు.. నీతూ భాయ్ నివాసాన్ని, కిరాణా షాప్‌ను ఒకేసారి చుట్టుముట్టాయి. ఈ మెరుపు తనిఖీల్లో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే అక్కడ గంజాయి కొనుగోలు చేస్తూ, సేవిస్తూ ఉన్న సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా ప్రముఖ ఐటీ కంపెనీలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు.
నిజానికి నీతూ భాయ్‌పై గతంలోనే అక్రమ దందాల కేసుల్లో పోలీసులు నిఘా పెట్టారు. గతంలోనే ఈమెను అరెస్ట్ చేసి కఠినమైన పీడీ యాక్ట్ (PD Act) కూడా నమోదు చేశారు. అయినప్పటికీ బుద్ధి మారని నీతూ భాయ్, ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ యథావిధిగా ఐటీ కారిడార్‌లో గంజాయి దందాను మొదలుపెట్టింది. చట్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఈమె తన పాత నెట్‌వర్క్‌ను మళ్లీ యాక్టివ్ చేసింది.
కాగా, ఈగల్ ఫోర్స్ దాడులు చేస్తుందనే ముందస్తు సమాచారం లీక్ కావడంతో డ్రగ్ డాన్ నీతూ భాయ్ అక్కడి నుంచి తృటిలో తప్పించుకుని పరారైంది. ప్రస్తుతం ఆమె కోసం ఈగల్ ఫోర్స్ అధికారులు నానక్‌రామ్‌గూడలోనే మకాం వేసి ప్రత్యేక బృందాలతో వేట కొనసాగిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో డ్రగ్స్ సరఫరా చేసే ఇలాంటి క్రిమినల్ నెట్‌వర్క్‌లపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టబోమని ఈగల్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.
Follow Us