Drug test: పైలెట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్‌కు డ్రగ్స్‌ పాజిటివ్.. అసలు డ్రగ్ టెస్ట్‌ ఎలా చేస్తారో తెలుసా ?

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులోని ప్రాథమిక పరీక్షల్లో రోహిత్‌ రెడ్డితో సహా అయిగురికి డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చింది. తుది నిర్ధారణ కోసం రక్తం, మూత్ర శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అసలు డ్రగ్స్ టెస్ట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Decoding Drug Testing, Procedures and Accuracy in Light of Moinabad Incident

Decoding Drug Testing, Procedures and Accuracy in Light of Moinabad Incident

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు వివాదం సంచలనం సృష్టిస్తోంది. మార్చి 14న రాత్రి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ పోలీసుల ఈగల్ టీమ్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో 2 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పైలట్ రోహిత్‌ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, వ్యాపారవేత్తలతో పాటు 11 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రాథమిక పరీక్షల్లో రోహిత్‌ రెడ్డితో సహా అయిగురికి డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చింది. తుది నిర్ధారణ కోసం రక్తం, మూత్ర శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపించారు. కావాలంటే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం పరీక్షలు చేయించుకుందామన్నారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. 

డ్రగ్స్ టెస్ట్ అంటే ఏంటి ? ఎలా గుర్తిస్తారు

ఒక వ్యక్తి శరీరంలో డ్రగ్స్‌ అవశేషాలు ఉన్నాయో లేవో  తెలుసుకునేందుకు చేసే టెస్ట్‌నే డ్రగ్ టెస్ట్ అని పిలుస్తారు. ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే వాటి అవశేషాలు వాళ్ల రక్తంలో కలుస్తాయి. ఆ తర్వాత శరీరంలోని వివిధ భాగాలకు చేరుతాయి. మూత్రం వచ్చినప్పుడు, చెమట వచ్చినప్పుడు లేదా జుట్టు ద్వారా అవి బయటకు వస్తాయి. డ్రగ్స్‌ను గుర్తించేందుకు ప్రధానంగా నాలుగు రకాల నమూనాలను సేకరిస్తారు. 

1.యూరిన్ టెస్ట్
ఇది సాధారణమైన పద్ధతి. డ్రగ్స్ తీసుకున్నాక 2 నుంచి 5 రోజుల వరకు మూత్ర నమూనాల్లో వాటి ఆనవాళ్లు ఉంటాయి.

2.బ్లడ్ టెస్ట్
బ్లడ్ టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్న కొన్ని గంటల్లోనే నిర్ధారించవచ్చు. కానీ రక్తంలో డ్రగ్స్‌ అవశేషాలు ఎక్కువ కాలం ఉండవు

3.హెయిర్ ఫోలికల్ టెస్ట్ 
ఇది చాలా కీలకమైన టెస్ట్. ఒకవ్యక్తి గత 90 రోజుల క్రితం డ్రగ్స్ వాడినా ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే జుట్టు కుదుళ్లలో డ్రగ్స్‌ అవశేషాలు చాలాకాలం పాటు ఉంటాయి. 

4.సలైవా టెస్ట్
ఇది ఉమ్మి ద్వారా చేసే పరీక్ష. కానీ ఇందులో గత 24-48 గంటల్లో వాడిన డ్రగ్స్‌ను మాత్రమే గుర్తించగలదు. 

పరీక్షా విధానం ఎలా ఉంటుంది ?

స్క్రీనింగ్ టెస్ట్ 
స్ర్కీనింగ్ టెస్ట్‌ను 'ఇమ్యునో అస్సే' అని పిలుస్తారు. ఇది ఒక ప్రాథమిక పరీక్ష. ఇది చేశాక ఫలితాలు త్వరగా వస్తాయి. కానీ కొన్నిసార్లు పలు మందుల వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది.

కన్ఫర్మేటరీ టెస్ట్ 
స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే.. దీన్ని ధృవీకరించేందుకు GC/MS (Gas Chromatography/Mass Spectrometry) అనే అడ్వాన్స్‌డ్ పద్ధతిని వినియోగిస్తారు. ఇది 100 శాతం కచ్చితమైన ఫలితం అందిస్తుంది. 

ఏ డ్రగ్స్ బయటపడతాయి?

ఈ పరీక్షల ద్వారా గంజాయి, కొకైన్, ఓపియాయిడ్స్, ఆంఫెటమైన్లు,హెరాయిన్ లాంటి అన్ని రకాల మత్తు పదార్థాలను గుర్తించవచ్చు. అయితే డ్రగ్స్ వాడిన తర్వాత ఎన్ని రోజులకు పరీక్షలు చేశారనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు పట్టుబడితే పోలీసులు వారికి ఎక్కువగా హెయిర్ టెస్ట్ చేసేందుకే మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఇది అంతకుముందు డ్రగ్స్ తీసుకున్నా కూడా బయటపెడుతుంది.

Advertisment
తాజా కథనాలు