Andhra Pradesh: ప్రభుత్వాలు మారినా..విధ్వంసం ఆగలేదు

ఎర్ర మట్టిదిబ్బలు విషయంలో ప్రభుత్వాలు మారినా పరిస్థితులు ఏమీ మారలేదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అప్పుడు జగన్ పార్టీని తిట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

New Update
Andhra Pradesh: ప్రభుత్వాలు మారినా..విధ్వంసం ఆగలేదు

Erra Matti Dibbalu: భీమిలి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తాం.. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలి..' ఇది 2023 ఆగస్టు 16న వైసీపీ టార్గెట్‌గా పవన్ కల్యాణ్‌ చేసిన విమర్శలు..! నాడు జగన్ పార్టీ అధికారంలో ఉండగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అయినా సీన్ ఏ మాత్రం మారలేదంటున్నారు పర్యావరణ ప్రేమికులు. నాడు జరిగిన విధ్వంసమే కూటమీ ప్రభుత్వంలోనూ కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు. ఏపీలో మూడు రోజులుగా ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం రాజకీయ రంగు పులుముకుంది.

భీమిలికి సమీపంలో ఉండే ఎర్రమట్టి దిబ్బలు 18 వేల నుంచి 20 వేల సంవత్సరాల క్రితం నాటివి. సాధారణంగా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మట్టి దిబ్బలు ఏర్పడతాయి. అయితే ఎర్రమట్టి దిబ్బలు మాత్రం వేల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఏర్పడ్డాయి. ఇలాంటి దిబ్బలు దక్షిణాసియాలో కేవలం మూడు ప్రాంతాల్లోనే ఉండగా.. అందులో భీమిలి ఒకటి. ఇంకోటి తమిళనాడులో ఉండగా.. మరొకటి శ్రీలంకలో ఉంది. అంటే ఇండియాలోనే ఈ తరహా మట్టి దిబ్బలు రెండు చోట్ల ఉన్నట్టు లెక్కా. అయితే తమిళనాడులోని టెరీ దిబ్బలతో పోల్చితే భీమిలి ఎర్రమట్టి దిబ్బల సైజ్ చాలా పెద్దది. దాదాపు 12 వందల ఎకరాల్లో ఈ మట్టిదిబ్బలు విస్తరించి ఉన్నాయి.

బంగాళాఖాతంలో గడ్డకట్టుకుపోయిన నీరు కారణంగా ఈ ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయని తెలుసా? అవును...వేల సంవత్సరాల క్రితం గడ్డకట్టుకుపోయిన ఆ నీరు ఎన్నో ఏళ్లకు కరగడం ప్రారంభమైంది. ఇక సాధారణంగా సముద్రం మీదుగా బలమైన గాలులు వీస్తాయని తెలుసు కదా.. అలా వీచిన గాలులకు ఒడ్డున ఉన్న ఇసుక పెద్ద ఎత్తున ఎగిరి ఇసుక మేటలు వేసింది. అవే చివరకు విశాఖ-భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలుగా ఏర్పడ్డడానికి కారణమైంది.

ఎర్ర మట్టి దిబ్బల విలక్షణమైన లక్షణం దాని ఎరుపు రంగు. ఫెర్రోజినేషన్ అనే ప్రక్రియ కారణంగా ఈ రంగు వచ్చిందని చెబుతుంటారు. హెమిటైట్ అనే ఇనుము అధికంగా ఉండే పదార్థం వదులుగా ఉన్న ఇసుక రేణువులను కప్పుతుంది. ఇది నీరు, సూర్యుడు, గాలికి ఎక్స్‌పోజ్‌ అవుతుంది. ఆ తర్వాత ఆక్సీకరణం చెంది ఇసుకను అందిస్తుంది. వర్షాలు పడినప్పుడు ఈ ఇసుక దిబ్బల్లోని హెమటైట్‌తో పాటు ఇతర మినరల్స్‌తో నీరు రియాక్ట్ అవుతుంది. ఇది ఐరన్ కలర్ అంటే రెడ్ కలర్‌ను విడుదల చేస్తుంది. ఆ తర్వాత క్రమంగా ఈ ఇసుక ఎరుపు రంగులోకి మారుతుంది.

1980, 90 దశకంలో సినిమా షూటింగ్లకు కేరాఫ్‌గా నిలిచిన ఈ ఎర్రమట్టి దిబ్బల అందాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇక ఈ అపురూప సంపదను బ్యూటీ పాయింట్‌ ఆఫ్‌ వ్యూగా చూడడం కూడా వాటి గొప్పతన్నాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. ఈ ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా 2014లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించినా వాటికి ఎలాంటి రక్షణా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరెవరో వస్తుండడం.. అక్కడి మట్టిని, ఇసుకను తవ్వి తీసుకుపోతుండడం చాలా ఏళ్లుగా కనిపిస్తోంది. అందుకే ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఎక్కువగా గునపాల దెబ్బల గుర్తులే కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ ఎర్రమట్టి దిబ్బల ధ్వంసం విషయం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ, కూటమి పార్టీల ఈ విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ సమయంలోనే ప్రారంభమైందని టీడీపీ-జనసేన ఆరోపిస్తోంది. అయితే భౌగోళిక వారసత్వ సంపదగా ఉన్న 262 ఎకరాల్ని సంరక్షిస్తూ ఎర్రమట్టి దిబ్బలకు ప్రత్యేక బఫర్‌జోన్‌ ఏర్పాటుచేసి భూ సమీ­కరణ పూర్తిచేశామని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం ఆ బఫర్‌ జోన్‌లోకి చొరబడి మరీ మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తోందని జగన్ పార్టీ ఆరోపిస్తోంది.

ఏ ప్రభుత్వమైనా పర్యావరణానికి హానీ చేసే విధంగా నడుచుకుంటే దాని ఎఫెక్ట్‌ కేవలం సంబంధిత ప్రాంతానికి, రాష్ట్రానికే పరిమితం కాదు.. అది యావత్‌ మానవాళిపై ప్రభావం చూపుతుంది. ఈ ఎర్రమట్టి దిబ్బల విధ్వంస విషయాన్ని కూడా రాజకీయపరం చేస్తుండడం బాధాకరణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇరు పార్టీల నేతలు వాదించుకోవడాన్ని తప్పుపడుతున్నారు.

Also Read:USA: చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..కాల్పుల తర్వాత ట్రంప్‌కు భారీగా మద్దతు

Advertisment
Advertisment
తాజా కథనాలు