/rtv/media/media_files/2026/05/12/gold-2026-05-12-20-43-43.jpg)
Gold
బంగారం అనేది సామాన్యుడికైనా, ప్రభుత్వానికైనా కష్టసుఖాల్లో తోడుగా ఉంటుంది. సంక్షోభ వచ్చినప్పుడు బంగారం తరచుగా ప్రజలను ఆదుకుంటుంది. కానీ చరిత్రలో చూసుకుంటే.. బంగారం అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను ఇబ్బందుల్లోకి కూడా నెట్టింది. అలాంటి పరిస్థితుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. స్వాతంత్ర్యం తర్వాత 1962లో భారత్-చైనా యుద్ధ సమయంలో తీసుకొచ్చిన 'బంగారు నియంత్రణ చట్టం' మొదటిసారిగా బంగారానికి పెద్ద సవాలు విసిరింది.
ఆ యుద్ధం వల్ల విదేశీ మారక నిల్వల్లో కొరత ఏర్పడింది. అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్, భారతీయ గృహాల్లో దాచిపెట్టిన బంగారం దేశానికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని గ్రహించారు. ఆ సమయంలో ప్రభుత్వం బంగారాన్ని వెలికితీసేందుకు బంగారు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం, 14 క్యారెట్ల కంటే ఎక్కువ స్వచ్ఛత ఉన్న బంగారు ఆభరణాల తయారీపై నిషేధం విధించారు. ఈ చర్య బంగారం స్మగ్లింగ్‌ను అడ్డుకుంటుందని అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ భావించారు. అయినప్పటికీ ఇది బంగారం స్మగ్లింగ్‌కు దారితీసి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. దీని ప్రభావాలు దశాబ్దాలుగా కొనసాగాయి.
1991లో భారతదేశ విదేశీ మారక నిల్వలు ఘోరంగా క్షీణించాయి. దేశం వద్ద కేవలం రెండు వారాల దిగుమతులకు సరిపోయే డబ్బు మాత్రమే మిగిలింది. దీంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీన్ని నివారించేదుకు కేంద్రం హడావిడిగా 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌కు తాకట్టు పెట్టింది. ఆ సమయంలో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బంగారు పెట్టెలను తరలించింది. దీంతో అప్పుడు ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఈ సంక్షోభమే 1991 ఆర్థిక సరళీకరణకు పునాది వేసింది.
2013లో డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పడిపోయింది. భారత కరెంట్ అకౌంట్ లోటు (CAD) రికార్డు స్థాయికి చేరిపోయింది. ముడి చమురు తర్వాత బంగారాన్ని విచ్చలవిడిగా దిగుమతి చేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా మారింది. ఈ సంక్షోభాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచింది. ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ కలిసి బంగారం దిగుమతులను నియంత్రించేందుకు 80:20 పథకాన్ని అమలు చేశాయి. ఇది దేశంలో బంగారం వినియోగాన్ని తగ్గించింది.
80:20 పథకం ప్రకారం చూసుకుంటే విదేశాల నుంచి 100 కిలోల బంగారం దిగుమతి చేసుకుంటే, అందులో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలి. దిగుమతి చేసుకున్న బంగారంలో 80 శాతాన్ని దేశంలో ఉన్న నగల వ్యాపారులకు, తయారీదారులకు అమ్ముకునేందుకు పర్మిషన్ ఉండేది. ఈ నిర్ణయం 2013-14లో భారత కరెంట్ అకౌంట్ లోటును తగ్గించడంలో ఎంతగానో సాయపడింది. కానీ మళ్లీ బంగారం స్మగ్లింగ్ పెరుగుతోందన్న కారణాల వల్ల.. 2014 నవంబర్‌లో మళ్లీ మోదీ సర్కార్ ఈ పథకాన్ని రద్దు చేసింది.
2015లో మోదీ ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రజలు భౌతిక బంగారం నుంచి డిజిటల్ లేదా కాగితపు బంగారానికి మారేలా ప్రోత్సహించడం చేసింది. ప్రభుత్వం బయటి నుంచి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ స్కీమ్ ఉద్దేశ్యం. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వం ఈ బాండ్లను తక్కువ ధరలకు అమ్మినప్పటికీ ఇప్పుడు వీటి చెల్లింపుల కోసం సొంత నిధుల నుంచి గణనీయమైన మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ద్రవ్యలోటు పెరుగుతోంది.
ఇటీవల కేంద్రం కొత్త సిరీస్‌ల SGB జారీని ఆపివేసింది. దీనికి కారణం ఈ పథకం ప్రభుత్వానికి రెండు రకాల నష్టాలను తెచ్చిపెడుతోంది. మొదటిది, పెట్టుబడిదారులు 2.5 శాతం వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంది. రెండవది మెచ్యూరిటీ సమయంలో పెరిగిన బంగారం ధరను చెల్లించాలి. బడ్జెట్ 2024లో కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గిపోయాయి. ఒకవేళ ప్రభుత్వం SGBని కొనసాగిస్తే పెట్టుబడిదారులకు పాత అధిక ధరలకే చెల్లించాలి. ఇది ఆర్థికంగా అంత లాభదాయకంగా ఉండదు.
అయితే బంగారం కొనుగోలు చేయొద్దని ప్రధాని మోదీ విజ్ఞప్తి భారత్‌కు మరోసారి సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు డాలర్లు, బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు. భారత్‌లో బంగారాన్ని ఒక 'నిరర్థక పెట్టుబడి'గా భావిస్తారు. ప్రజలు బంగారంపై పెట్టే పెట్టుబడుల వల్ల రూపాయి విలువ బలహీనపడుతుంది. అలాగే విదేశీ మారకం బయటకు పోతోంది. అందుకోసమమే దేశీయ డబ్బు చలామణిలోనే ఉంటూ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ నిధులను దేశ ప్రగతికి ఉపయోగపడే స్టాక్ మార్కెట్, మౌలిక వసతుల ప్రాజెక్టులు లేదా ఉత్పాదక రంగాలలో పెట్టుబడిగా పెట్టాలని కోరుతోంది.
Follow Us