/rtv/media/media_files/2026/05/07/west-bengal-election-related-violence-history-2026-05-07-15-40-02.jpg)
west bengal election related violence history
పశ్చిమ బెంగాల్(west bengal) లో ఎన్నికలు జరిగినప్పుడల్లా అక్కడ రక్తపాతం జరగడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా బీజేపీ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాత్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నార్త్ 24 పరగణాస్ జిల్లాని మధ్యగ్రామ్‌లో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపేశారు. అనంతరం నిందితులు పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రనాథ్ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అతడిపై దాదాపు పది రౌండ్ల కన్నా ఎక్కువే కాల్పులు జరిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు స్థానిక రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి హత్యా ఘటనలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Also Read : విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న గవర్నర్.. ఎవరీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్?
2006 అసెంబ్లీ ఎన్నికలు
2006లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం 292 స్థానాలకు గాను 235 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య కచ్చితమైన సమాచారం లేనప్పటికీ సుమారు 5 నుంచి 6 మంది మరణించినట్లు అప్పుడున్న స్థానిక మీడియా వెల్లడించింది.
2008 పంచాయతీ ఎన్నికలు
ఈ పంచాయతీ ఎన్నికల్లో వామపక్ష, టీఎంసీ(tmc) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్, సింగూర్‌లలో జరిగిన భారీ ఘర్షణలు జరిగాయి. ఎన్నికల తర్వాత సుమారు 45 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.
2009 లోక్‌సభ ఎన్నికలు
2009 లోక్‌సభ ఎన్నికల్లో జంగల్‌మహల్ ప్రాంతంలో సీపీఎం, టీఎంసీ-కాంగ్రెస్ కార్యకర్తలు, మావోయిస్టుల మధ్య త్రిముఖ ఘర్షణ జరిగింది. మార్చి, మే నెలల మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో కనీసం 15 మంది చనిపోయినట్లు తెలిసింది. ఎన్నికల అనంతర హింస ఆందోళనకర స్థాయికి పెరిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల నుంచి 2010 మధ్యకాలం వరకు మొత్తం 269 మంది హత్యకు గురయ్యారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2011
2011 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ 34 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికారు, కానీ ఎన్నికల హింస మాత్రం అలాగే కొనసాగింది. ఈ ఎన్నికల్లో 17-25 మంది హత్యకు గురయ్యారు. అలాగే అనేక లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులు కూడా నమోదయ్యాయి. సీపీఎం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 2011 నుంచి జూలై 2016 మధ్య 183 మంది వామపక్ష కార్యకర్తలు హత్యకు గురయ్యారు.
బెంగాల్ పంచాయతీ ఎన్నికలు 2013
ఈ ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలను సైతం మోహరించినప్పటికీ ఘర్షణల వల్ల 20 నుంచి 30 మంది మరణించారు. పోలింగ్ రోజునే కనీసం 17 మరణించారు. కేంద్ర పారామిలిటరీ బలగాల మోహరింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘకాలం వివాదం నడిచింది.
లోక్‌సభ ఎన్నికలు 2014
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణలో 7 నుంచి 16 మంది మరణించారు. మరో 1,298 మంది పార్టీల కార్యకర్తలు గాయాలపాలయ్యారు.
Also Read : సీఎంగా విజయ్ .. TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ !
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2016
ఈ ఎన్నికల సమయంలో బెంగాల్‌లోని పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. హింస అదుపులో ఉన్నప్పటికీ.. ఎన్నికల చివరి దశలో దీని తీవ్రత పెరిగింది. ఈ ఘర్షణల్లో 8 నుంచి 12 మంది మరణించినట్లు తెలిసింది. అలాగే వందలాది మంది గాయాలపాలయ్యారు.
బెంగాల్ పంచాయతీ ఎన్నికలు 2018
గత 20 ఏళ్లలో బెంగాల్‌లో జరిగిన 2018 పంచాయతీ ఎన్నికలు అత్యంత హింసాత్మకమైనవిగా నిలిచాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజున జరిగిన హింసాకాండలో మొత్తం 75 మంది మరణించారు. వీళ్లలో 13 మంది ఎన్నికల రోజే మరణించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఏకగ్రీవంగా నిర్ణయించగా.. వీటిలో అత్యధిక స్థానాలను టీఎంసీ గెలుచుకుంది.
2019 లోక్‌సభ ఎన్నికలు
2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ ఓ ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించింది. ఉత్తర బెంగాల్, కోల్‌కతా సమీపంలో భారీస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఏడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కనీసం 12 నుంచి 15 మంది మరణించగా.. 700 మందికి పైగా గాయపడ్డారు.
2021 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లో టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 'కాల్ ఫర్ జస్టిస్' అనే వాస్తవ పరిశీలన కమిటీ నివేదిక ప్రకారం.. ఈ ఎన్నికల సమయంలో కనీసం 1,300 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 17 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఇక 2019 నుంచి 2021 మధ్య బెంగాల్‌లో 130 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు.
2023 పంచాయతీ ఎన్నికలు
ఈ పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల్లో సుమారు 45 నుంచి 55 మంది మరణించారు. వీళ్లలో 12 నుంచి 18 మంది పోలింగ్ జరిగిన రోజే మరణించినట్లు తెలుస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికలు
ఈ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలో 6 నుంచి 10 మంది మరణించారు. 100కు పైగా దాడులు, ఎన్నో EVMలు ధ్వంసం చేసిన ఘటనలు జరిగినట్లు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
Follow Us