ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సోమవారం ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవానికి భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారు. తొలిరోజున ఉదయమే ఏకంగా 60 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. అయితే ఈ మహా కార్యక్రమం ద్వారా యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఉత్సవం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. Also Read: నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. బ్రాహ్మణ దంపతులకు బంపర్ ఆఫర్.. ''కుంభమేళాకు వచ్చేవారు హోటళ్లు, తాత్కాలిక నివాసాలు, గెస్ట్‌హౌస్‌లు, ఆహారం, వస్తువులు, పూజాసామాగ్రి ఇలా అనేక సేవలను వినియోగించుకుంటారు. ఇలా ఒక్కో వ్యక్తి కనీసం రూ.5 వేలు ఖర్చు చేసినా రూ.2 లక్షల కోట్లు అవుతుందని'' కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CIAT) జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖాండేవాల్ తెలిపారు. హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక లాడ్జీల ద్వారా రూ.40 వేల కోట్ల ఆదాయం, భోజనం, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు వంటివాటి వల్ల రూ.20 వేల కోట్ల వ్యాపారం జరగనుందని తెలిపారు. ఇక నూనె, దీపాలు, గంగానీరు, దేవతా విగ్రహాలు, పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాల, ఇతర వస్తువుల వల్ల మరో రూ.20 వేల కోట్ల ఆదాయం రానుంది. కుంభామేళాకు అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరికోసం టాక్సీలు, సరకు రవాణా వంటి సేవల వల్ల రూ.10 వేల కోట్లు, టూరిస్టు గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీల వల్ల మరో రూ.10 వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి. మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ప్రొడక్ట్స్, ఇతర ఔషధాల వల్ల రూ.3 వేల కోట్లు, ఈ టికెటింగ్, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు, డిజిటల్ పేమెంట్ల వల్ల రూ. వెయ్యి కోట్లు, మీడియాలో ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలతో రూ.10 వేల కోట్ల వ్యాపారం జరగనుంది. Also Read: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో వేతనాలు పెంపు ఇక 2019లో జరిగిన ఆర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు వచ్చారు. దీంతో యూపీ ఆర్థిక వ్యవస్థకు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 కోట్ల మంది భక్తులు ఈ కార్యక్రమానికి రానున్నట్లు అంచనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి యూపీకి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం రానున్నట్లు అంచనా వేస్తున్నారు.