NEET 2026 :  నేడే 'నీట్‌-యూజీ 2026'... అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే

అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' నేడు జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూజీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.

New Update
NEET UG 2026

NEET UG 2026

NEET 2026 : దేశంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' నేడు జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూజీసీ అన్ని పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:20 గంటల వరకు ఒకే షిఫ్టులో కొనసాగుతుంది.

సమయపాలన పాటించాల్సిందే..

నీట్ పరీక్షలో సమయపాలన అత్యంత కీలకం. విద్యార్థులు మధ్యాహ్నం 1:30 గంటల లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేయబడతాయి. తనిఖీ ప్రక్రియల దృష్ట్యా అభ్యర్థులు కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవడం శ్రేయస్కరం. మతపరమైన దుస్తులు ధరించే అభ్యర్థులు మరింత ముందుగా, అంటే మధ్యాహ్నం 12:30 గంటలకే కేంద్రానికి చేరుకొని తనిఖీలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కఠినమైన డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నారు. పురుషులు సాధారణ ట్రౌజర్లు, ప్యాంట్లు లేదా జీన్స్ ధరించాలి. ఫుల్ స్లీవ్డ్ షర్ట్స్ (నిండు చేతుల చొక్కాలు) నిషిద్ధం. పెద్ద బటన్లు, పెద్ద జిప్పులు లేదా ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులను అనుమతించరు. మహిళలు సాధారణ లెగ్గింగ్స్ లేదా ట్రౌజర్లు ధరించాలి. చేతులకు మెహందీ ఉండకూడదు. ఎలక్ట్రానిక్ ఆభరణాలు లేదా మెటాలిక్ వస్తువులు ధరించరాదు. అభ్యర్థులెవరూ బూట్లు (Shoes) ధరించకూడదు. కేవలం సాధారణ స్లిప్పర్లు, శాండల్స్ వంటి తక్కువ హీల్ ఉన్న పాదరక్షలు మాత్రమే ధరించాలి. టోపీలు, మఫ్లర్లు, స్కార్ఫ్‌లు, హ్యాండ్‌బ్యాగులు మరియు పర్సులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా తమ 'నీట్ అడ్మిట్ కార్డు' (హాల్ టికెట్) వెంట తెచ్చుకోవాలి. అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ) తప్పనిసరి. గుర్తింపు కార్డు లేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.

నిషేధిత వస్తువులు - భద్రత

మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచీలు, ఇయర్ ఫోన్లు, పేజర్లు వంటి ఏ రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరు. వీటిని భద్రపరచడానికి కేంద్రాల వద్ద ఎలాంటి లాకర్ సౌకర్యం ఉండదని, అభ్యర్థులు తమ సొంత రిస్క్ మీద బయట ఎక్కడైనా వీటిని స్టోర్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్షన్ 163 BNSS (గతంలో సెక్షన్ 144) అమలులో ఉన్నందున, పరీక్షా కేంద్రాల వద్ద జనం గుమిగూడకూడదని ఆదేశాలు జారీ చేశారు.నిరంతర విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల నిఘా,బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి ఏర్పాట్లతో నీట్ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర నోడల్ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. మరిన్ని తాజా వివరాల కోసం విద్యార్థులు neet.nta.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Advertisment
తాజా కథనాలు