/rtv/media/media_files/2026/03/02/maoists-2026-03-02-16-35-13.jpg)
The Maoists have crores of rupees in cash
Maoist Party : పోలీసుల ఎదుట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కుదెలైపోయింది. ఇప్పటికే వందలాది మంది మావోలు మృత్యువాత పడగా, పలువురు అగ్రనేతలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి, మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, నరసింహారెడ్డి వంటి అగ్రనేతలంతా లొంగిపోవడంతో ఇక ఆ పార్టీ దేశంలో కనుమరుగవ్వడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వారు పార్టీ కోసం సేకరించిన డబ్బు, నగలు ఎక్కడున్నాయనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
Also Read : పశ్చిమ బెంగాల్లో 50 లక్షలకు పైగా చొరబాటుదారులు.. వెలుగులోకి సంచలన నిజాలు
కేంద్ర నిఘావర్గాల దర్యాప్తు
కేవలం డబ్బు, బంగారమే కాకుండా మావోయిస్టులకు సంబంధించిన పలు విలువైన డ్యాక్యుమెంట్లు, ఆధునిక ఆయుధాలు అడవుల్లో రహాస్య ప్రదేశాల్లో దాచి ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. వాటి వివరాలను సేకరించడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు మావోయిస్టు పార్టీ అగ్రనేతలను తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల్లో అగ్రనేతలుగా ఉన్నవారంతా ప్రస్తుతం పోలీసుల సమక్షంలో ఉన్నారు. దీంతో పార్టీ నిధులు, నిల్వల గురించి వారికి తెలిసి ఉంటుందన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఆర్మీ ఇంటెలిజెన్స్‌తో పాటు కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర బృందాలు ఇప్పటికే వారిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నాయి.
డబ్బు బంగారం ఎవరివద్ద ఉంది?
గడచిన ఆరు నెలల కాలంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ఒక్కరొక్కరుగా లొంగిపోతున్న విషయం తెలిసిందే. వారు లొంగిపోతున్న సమయంలో కొంతమది నేతలు తమ వద్ద ఉన్న ఆయుధాలు, నగదు, డబ్బు పార్టీ అధీష్టానానికి అప్పగించి వచ్చినట్లు చెబుతున్నారు. మరికొంతమంది ఆయుధాలతో లొంగిపోయినప్పటికీ పార్టీకి చెందిన నిధులు, బంగారం మాత్రం అడవుల్లో ఉన్న క్యాడర్ కు అప్పగించి వచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్‌బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాము ఆయుధాలతో విప్లవం రాదు అని నమ్మాం కనుక తమ వద్ద ఉన్న ఆయుధాలతో లొంగిపోయామని, అయితే ఇంకా పార్టీలో ఉన్న క్యాడర్ అడవుల్లో ఉండి పోరాడేందుకు సిద్ధంగా ఉండటంతో తన వద్ద ఉన్న ఆరుకోట్ల రూపాయల నగదు, ఆరు కిల్లో బంగారం పార్టీ నేతలకు అప్పగించి వచ్చినట్లు స్పష్టం చేశారు. దాన్ని భూతల్లి కడుపులోనే దాస్తామని కూడా ఆయన వెల్లడించారు.
తెలంగాణలో రూ.20 లక్షల డంప్ స్వాధీనం
మావోయిస్టు పార్టీకి కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అగ్రనేతగా ఉండగా గత ఏడాది ఎన్కౌంటర్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తర్వాత దేవ్‌జీ అలీయాస్ తిప్పిరి తిరుపతినే పార్టీ పగ్గాలు చేపట్టారన్న ప్రచారం సాగింది.. అంటే పార్టీ అగ్రనేత దేవ్‌జీ అనే క్యాడర్ చెబుతుంది. అలాంటి నేతనే లొంగిపోయినప్పుడు పార్టీకి సంబంధించిన అన్నివనరులు, ఆయుధాలు, డబ్బు, బంగారం అన్ని ఆయనకు తెలియకుండా ఉండదు అనేది పోలీసుల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయనను విచారిస్తు్న్నారు. మావోయిస్టు పార్టీ వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతోపాటు వందల కోట్ల రూపాయలు, అంతకు మించి విలువైన బంగారం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు, పీఎల్జీఏ కమాండర్ అయిన బార్సేదేవాను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణ చరిత్రలోనే మొదటి సారిగా మావోయిస్టు డంప్ నుంచి రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అలాగే 48 అత్యంత అధునాతన ఆయుధాలు పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. - maoist party crisis in telangana
ఛత్తీస్‌గఢ్ లో భారీ డంప్
కాగా, ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లా పోలీసులు రెండు మావోయిస్టు డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక డంప్ నుండి ఏకంగా రూ.46 లక్షల 31 వేల 5 వందల రూపాయల నోట్ల కట్టలు లభించాయి. రెండో డంప్ నుండి భారీగా ఆయుధాలు, టిఫిన్ బాక్స్ బాంబులు, ఎలక్ట్రానిక్ వస్తువులు లభించాయి. డంప్‌లో దొరికిన నగదులో రెండు పాత 2 వేల నోట్లు కూడా ఉండటం గమనార్హం.
కొవిద్ సమయంలో బంగారం రూపంలోకి
కాగా మావోయిస్టులు కొవిద్ సమయంలో తమ వద్ద ఉన్న కోట్లాది రూపాయల నగదును బంగారం రూపంలోకి మార్చినట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిసా, ఏపీ తదితర రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. పార్టీకి నిధుల సేకరించడానకి విస్తృత నెట్వర్క్ ఉందని జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) ధృవీకరించింది. ఈ క్రమంలోనే సుమారు రూ.400 కోట్ల విలువైన నగదును బంగారం రూపంలోకి మార్చినట్లు తెలుస్తోంది. అయితే అది ఎవరివద్ద ఉందనేది ప్రస్తుతం సస్పె్న్స్.
పార్టీ సానుభూతి పరుల పేరుతో డొల్ల కంపెనీలు
కొంత నగదును మాత్రం పార్టీ సానుభూతిపరులు, వారి బంధువులు, కుటుంబసభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి మళ్లించినట్లు తెలుస్తోంది. పలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రూ.కోట్లు జమ చేస్తున్నారని భావిస్తున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎల్ఎఫ్ఐ) నాయకుడు దినేశ్ గోపేను ఇటీవల ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దినేశ్ తన భార్య, ఆమె బంధువుల పేరిట పలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ఆయన కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన దాదాపు రూ.20 కోట్లను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడని తేల్చారు.ఇక బీజాపూర్ పోలీసులు మూల్‌వాసీ బచావో మంచ్ (ఎంబీఎం) సభ్యులు ఇద్దరు మావోయిస్టుకు పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలో రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా అరెస్టు చేశారు. మజ్దూర్ సంఘటన సమితి (ఎంఎస్ఎస్) సభ్యులు కొందరు నిధులు సేకరించి, బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్నశర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా, ఆమె ఫీజుకు కావాల్సిన రూ.1,13,70,500ను బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించడం సంచలనంగా మారింది. పార్టీ సానుభూతి పరుల వద్దే ఇంత సొమ్ము ఉంటే ఇంకా పార్టీ డంపులలో ఎంత మేరకు ఉంటుందన్న చర్చ సాగుతోంది.
మావోయిస్టు పార్టీ నేతలు ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాల్లో ఇంకా ఎంత నగదు ఉందనే అనుమానాలను అధికారులు వెల్లడిస్తున్నారు. మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు, ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వారు తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి అప్ప చెప్పిన తర్వాతే బయటకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ఈ విషయమై ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలు ఆరా తీస్తున్నారు.
నోట్ల మార్పిడితో తీవ్ర నష్టం
కాగా మావోయిస్టు పార్టీ నోట్ల మార్పిడి సమయంలో తీవ్రంగా నష్టపోయినట్లు పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. సుమారు రూ.200 కోట్ల వరకు పాత నోట్లను మార్పిడి చేసేందుకు పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కొంతమొత్తాన్ని మార్చినప్పటికీ మిగతది సాధ్యం కాలేదని చెబుతున్నారు. నోట్ల మార్పిడి కోసం పార్టీ సానుభూతిపరులు, ఇతర వర్గాల వారికి పార్టీ నగదును అప్పగించగా వారు డబ్బును మార్చినప్పటికీ తిరిగి పార్టీకి ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. దీన్ని అగ్రనేత ఒకరు దృవీకరించారు కూడా. అలా పెద్దమొత్తంలో పార్టీ ఆర్థికంగా నష్టపోయినట్లు నేతలు చెబుతున్నారు.
Also Read : గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్
ఆ బంగారం ఎక్కడుంది?
మావోయిస్టు పార్టీ వద్ద సుమారు400 కిలోల బంగారం(gold) ఉండి ఉంటుందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే దాన్ని ఎక్కడ దాచారనేది ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. బంగారాన్ని అంతా అడవుల్లోని డంపు(maoist dump) ల్లో దాచి ఉండటారని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బంగారం మావోయిస్టు పార్టీ వద్ద ఉందనే అనుమానంతో ఆయా సంస్థలు మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి. అయితే పార్టీ అగ్రనేతలు పార్టీ నిలువుల గురించి నోరు తెరుస్తారా? లేదా అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.
Follow Us