/rtv/media/media_files/2026/05/07/venugopal-chennithala-and-satheesan-2026-05-07-21-05-04.jpg)
Venugopal, Chennithala and Satheesan
ఎర్రకోట బద్దలైంది.. కేరళ(kerala) లో హస్తం వికసించింది. UDFకు ఘన విజయం కట్టబెట్టి, తమపై మళ్లీ నమ్మకం ఉంచారు కేరళ ప్రజలు. కానీ.. అసలు కథ ఇప్పుడే మొదలైంది. గెలుపు సంబరాలు ముగియక ముందే.. కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయా? కేరళ ముఖ్యమంత్రి కిరీటం దక్కేది ఎవరికి? రహస్య ప్రకటనలతో సీనియర్ నేతలు పంపుతున్న సంకేతాలు ఏంటి? ఢిల్లీ టూ గల్లీ... కేరళ రాజకీయాల్లో క్షణక్షణానికీ మారుతున్న ఉత్కంఠభరిత పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విజయం ఖాయమైంది... ఇప్పుడు అందరి కన్నూ ఆ ఒక్క కుర్చీ పైనే! సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో త్రిముఖ పోరు నడుస్తోంది. ముగ్గురు ఉద్దండులు రేసులో ముందున్నారు. నెంబర్ వన్... వి.డి. సతీశన్(VD Satheesan)! గత శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఒంటిచేత్తో ఫైట్ చేసిన ఈయన.. ఇప్పుడు సీఎం పదవి తనకే దక్కాలంటున్నారు. "సతీశన్ అంత సులభంగా వెనక్కి తగ్గే రకం కాదు" అని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తోడు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు కూడా సతీశన్‌కే ఉందనేది ఇన్ సైడ్ టాక్! సతీశన్ కేరళ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందుకు ఆయన హైకోర్టు అడ్వకేట్‌గా ఉన్నారు. NSUIలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన మొదటిసారి 2001లో కేరళ శాసనసభకు పరవూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ నుంచే వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. సామాజిక అంశాలపై అవగాహన ఉన్న మేధావిగా కేరళ ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 2021లో కాంగ్రెస్ పార్టీలో యువ రక్తాన్ని నింపాలనే ఉద్దేశంతో హైకమాండ్ రమేష్ చెన్నితాల స్థానంలో సతీశన్‌ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసింది.
Also Read : మేనిఫెస్టోలోని హామీలు విజయ్ అమలు చేస్తారా ?.. TVK ముందున్న సవాళ్లు ఇవే..
UDF High-Drama Begins
నెంబర్ టూ... కేసీ వేణుగోపాల్(AICC General secretary KC Venugopal)! ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.. గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు! UDF Party Victory విజయం సాధించగానే త్రివేండ్రం రోడ్ల నిండా వేణుగోపాల్ పోస్టర్లు వెలిశాయి. ఇది ఎవరి ప్లాన్? సీఎం పదవి తనకే అన్న ధీమానా? పావులు కదిపేందుకు ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనం అవ్వడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? కేసీ వేణుగోపాల్ అలప్పుజ ఎంపీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం AICC జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంటుంది. దానితో పోల్చుకుంటే ముఖ్యమంత్రి పదవి ఆయనకు చిన్నదిగా కనిపించవచ్చు.. సో, ఆయనకు ఆ కుర్చీపై అంతగా ఆసక్తి ఉందని పొలిటికల్ విశ్లేషకులు అనుకుంటున్న మాట. విద్యార్థి దశలోనే కేరళ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. మన్మోహన్ సింగ్ UPA ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రిగా సేవలందించారు.
ఇక నెంబర్ త్రీ... సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల(Ramesh Chennithala). ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న ఈయన కూడా సీఎం కుర్చీ కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసినా.. మిగతా వారు ఏకగ్రీవంగా అంగీకరిస్తారా? ఏకాభిప్రాయం సాధించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి తలకు మించిన భారంగా మారనుందా? కాంగ్రెస్ పార్టీలో రమేశ్ చెన్నితాల చాలా సీనియర్. కేవలం 26 ఏళ్లలోనే కేరళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించి, రాష్ట్రంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా రికార్డు సృష్టించారు. ఆయన నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన హరిపాడ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. KPCC అధ్యక్షుడిగా 9 ఏళ్లు పనిచేసిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2014 నుండి 2016 వరకు ఉమ్మన్ చాందీ ప్రభుత్వంలో కేరళ రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016 నుండి 2021 వరకు కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఈ టైంలో LDF ప్రభుత్వంలోని పలు అవినీతి అంశాలను.. ముఖ్యంగా స్ప్రింక్లర్ వివాదం, బ్రూవరీ కుంభకోణం వంటి స్కాంలను బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన కాంగ్రెస్ హైకమాండ్... వెంటనే రంగంలోకి దిగింది. ట్రబుల్ షూటర్లు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లను పరిశీలకులుగా కేరళకు పంపించింది. వీళ్లు IUMLతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరుపుతున్నారు. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. మిత్రపక్షాల ఒత్తిడికి కాంగ్రెస్ తలొగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే... ఒంటరిగానే 63 స్థానాలు గెలుచుకుని సూపర్ స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది కాంగ్రెస్. "పదవుల పంపకంలో మాదే పైచేయి... మీ కండిషన్స్‌కు నో ఛాన్స్" అని మిత్రపక్షాలకు కాంగ్రెస్ ఇన్ డైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే సీఎం ఎవరన్నది పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్ డిసిషన్ మాత్రమే.
ముగ్గురు నేతల మధ్య కుర్చీ ఫైట్ నడుస్తుంటే... సడెన్‌గా తెరపైకి వచ్చారు శశి థరూర్. కాంగ్రెస్‌లో నాయకత్వ అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. కౌంటింగ్ రోజున ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో బాంబు పేల్చాయి. "మీరు కేరళ సీఎం కాబోతున్నారా?" అని మీడియా సూటిగా ప్రశ్నిస్తే... థరూర్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? "మీరు నా నుండి ఏమి రాబట్టాలని చూస్తున్నారో నాకు కచ్చితంగా తెలుసు. నేను అవేమీ చెప్పను. ఆన్సర్ చాలా క్లీయర్" అని చెప్పుకొచ్చారు.
Also Read : ఖైదీని లవ్ చేసి పెళ్లాడిన జైలర్.. ఇది మామూలు లవ్ కాదు మావా..!
ఒకవైపు గెలిచిన కూటమిలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం మంటలు రేగుతుంటే... ఓడిన శిబిరంలో మాత్రం ఒక సైలెంట్ వాతావరణం కనిపించింది. నిన్నటి దాకా కేరళను శాసించిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎగ్జిట్... అందరినీ ఆశ్చర్యపరిచింది. LDF పరాజయం తర్వాత కన్నూర్ నుంచి విమానంలో తిరువనంతపురం చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి తన అధికారిక కాన్వాయ్‌లో వెళ్లలేదు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేవు.. భద్రతా బలగాల హడావిడి లేదు. తన భార్య, కుమార్తె, కొందరు వామపక్ష నేతలతో కలిసి ఓ ప్రైవేట్ వాహనం ఎక్కి.. ఒక సామాన్యుడిలా ఇంటికి వెళ్లిపోయారు విజయన్. విమానం దిగిన వెంటనే విలేకరులను చూసి కేవలం ఒక చిరునవ్వు మాత్రమే నవ్వారు. చేయి ఊపుతూ మౌనంగా వెళ్లిపోయారు. ఆయనతో మాట్లాడాలని విలేకరులు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అధికారం శాశ్వతం కాదు, ప్రజా తీర్పుకి తలొగ్గాల్సిందే అని చెప్పకనే చెప్పారు విజయన్.
సో... అదీ మేటర్. LDF శకం ముగిసింది.. UDF ఫైట్ మొదలైంది. ఒకవైపు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సతీశన్.. మరోవైపు ఢిల్లీ పెద్దల ఆశీస్సులున్న వేణుగోపాల్.. ఇంకోవైపు సీనియార్టీని నమ్ముకున్న చెన్నితాల.. మధ్యలో థరూర్ సస్పెన్స్! కేరళ కొత్త రాజు ఎవరు? పరిశీలకుల రిపోర్ట్‌తో అధిష్ఠానం తీసుకోబోయే సంచలన నిర్ణయం ఏంటి? ఈ రాజకీయ చదరంగంలో గెలిచేది ఎవరో తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. అయితే వీరిలో ఎవరు కేరళ సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Follow Us