/rtv/media/media_files/2026/05/06/fathima-thahiliya-2026-05-06-16-14-28.jpg)
Fathima Thahiliya makes history as IUML’s first woman MLA
భారత రాజకీయాల్లో 2026 మే 4వ తేది ఓ చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోయింది. తమిళనాడులో గతం 50 ఏళ్లుగా అధికారంలోకి వస్తున్న DMK, AIDMK పార్టీలను విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఓడించింది. మరోవైపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని కాదని.. బెంగాల్ ప్రజలు బీజేపీకి జై కొట్టారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన ముగియగా.. కేరళ రాజకీయాల్లో ఓ కొత్త ధృవతార ఆవిర్భవించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువ నాయకురాలు ఫాతిమా తహిలియా ఎమ్మెల్యేగా గెలిచారు. పెరంబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈమె.. LDF దిగ్గజ నేతను ఓడించి రికార్డు సృష్టించారు. గత ఏడు దశాబ్దాలుగా ముస్లిం లీగ్ నుంచి ఇప్పటిదాకా ఏ మహిళా కూడా గెలవలేదు. మొదటిసారిగా ఫాతిమా తహిలియాకు దక్కిన ఈ విజయం.. కేరళ రాజకీయాల్లో ఓ కొత్త శకానికి నాంది పలికింది.
ఫాతిమా తహిలియా రాజకీయ అరంగేట్రాన్ని కొందరు రాజకీయ నిపుణులు మమతా బెనర్జీ తొలిరోజుల పోరాటంతో పోలుస్తున్నారు. మమత కూడా విద్యార్థి దశ నుంచే పోరాటాలు, ఉద్యమాల ద్వారా కమ్యూనిస్టులను ఎలా ఓడించారో.. 34 ఏళ్ల ఫాతిమా కూడా అదే రూట్‌లో పయనించారని చెబుతున్నారు. ఫాతిమా.. ఎంఎస్ఎఫ్ (MSF) విద్యార్థి విభాగం నుంచి తన గళాన్ని వినిపిస్తున్నారు. కేరళ వీధుల్లో లాఠీ దెబ్బలకు వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. 1984లో జాదవ్‌పూర్‌లో సోమనాథ్ ఛటర్జీని మమతా బెనర్జీ ఓడించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు పెరంబ్రాలో ఫాతిమా సాధించిన విజయం కూడా సీపీఎంకు బిగ్ షాక్ ఇచ్చింది.
కేరళలో కొన్ని దశాబ్దాలుగా ముస్లిం లీగ్‌ను పురుషాధిక్య పార్టీగానే చూస్తున్నారు. మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చే విషయంలో ఈ పార్టీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం రాహుల్ గాంధీ పట్టుబట్టి మరి ఫాతిమాను రంగంలోకి దించారు. గతంలో 1996, 2021లో ఈ పార్టీ నుంచి మహిళలు పోటీ చేసినా కూడా ఓడిపోయారు. కానీ ఫాతిమా తహిలియా మాత్రం తన వాగ్ధాటితో, అంకితభావంతో పార్టీలోని పురుషాధిక్య ధోరణులను తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ చేసిన ఉద్ధృత ప్రచారం కూడా మహిళా ఓటర్లను యూడీఎఫ్ (UDF) వైపు మళ్లించింది.
Also Read: ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే విజయ్ కు సపోర్ట్.. కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్.. అధికారికంగా లేఖ!
ఈ ఎన్నికల్లో UDF100కు పైగా స్థానాల్లో గెలవగా.. ఇందులో ఫాతిమా 'పోస్టర్ గర్ల్'గా నిలిచారు. ఈమెకు కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో ఆమెకు ప్రజలతో మమేకం ఉంది. ప్రత్యర్థులు ఆమెను గెలవకుండా అడ్డుకునేందుకు మతపరమైన ప్రచారాలు చేసినప్పటికీ కూడా అవి ఫలించలేదు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఫాతిమా.. తన మేధస్సుతో ఎమ్మెల్యేగా గెలుపొంది యువతకు ఆదర్శంగా నిలిచారు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన అధ్యాయాన్ని ముగించారు. అయితే ఆమెలో ఉన్న ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని కేరళ ప్రజలు ఫాతిమాలో చూస్తున్నారు. భారత రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి స్థానం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి కేరళలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వంపైనే ఉంది. అయితే ఫాతిమా తహిలియాకు కేరళ మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే ముస్లిం లీగ్ తరపున మొట్టమొదటి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టి మరో రికార్డును ఆమె సొంతం చేసుకుంటారు.
Also Read: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్‌కు గుడ్‌న్యూస్
Follow Us