/rtv/media/media_files/2026/04/08/europe-and-china-to-launch-joint-mission-to-study-space-weather-2026-04-08-15-20-14.jpg)
Europe and China to launch joint mission to study space weather
చైనా, యూరప్ దేశాల మధ్య సరికొత్త అంతరిక్ష స్నేహాన్ని చాటుతూ 'స్మైల్' (SMILE - Solar wind Magnetosphere Ionosphere Link Explorer) మిషన్ సిద్ధమైంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాయి. 2,300 కిలోల బరువున్న స్మైల్ ఉపగ్రహాన్ని 2026 ఏప్రిల్ 9న ఫ్రెంచ్ గయానాలోని అంతరిక్ష కేంద్రం నుంచి వేగా-సి రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.
ఈ మిషన్ ప్రధాన లక్ష్యం సూర్యుని నుంచి వెలువడే ప్రమాదకరమైన సౌర గాలులు.. భూమికి ఉండే అయస్కాంత రక్షణ కవచం (మాగ్నెటోస్పియర్)తో ఎలా సంకర్షణ చెందుతాయో అధ్యయనం చేయడం. వాస్తవానికి కంటికి కనిపించని ఈ అయస్కాంత క్షేత్రాన్ని 'స్మైల్' శాటిలైట్ మొదటిసారిగా సాఫ్ట్ ఎక్స్-రే టెక్నాలజీని వినియోగించి స్పష్టమైన చిత్రాలుగా మార్చనుంది. అంతేకాదు ఇది భూమికి సుమారు 1,21,000 కిలోమీటర్ల దూరంలో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంటూ.. రాబోయే మూడేళ్ల పాటు సౌర తుఫానుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీంతో అంతరిక్షంలోని అదృశ్య దృశ్యాలను మనం తొలిసారిగా చూసే ఛాన్స్ ఉంటుంది.
Also Read: కాల్పుల విరమణ ఒప్పందం ప్లాన్‌లో హార్ముజ్‌పై టోల్..
ఈ ప్రయోగం అనేది మన దైనందిన జీవితానికి కూడా ఎంతో కీలకంగా మారనుంది. సూర్యుని నుంచి వచ్చే శక్తివంతమైన కణాలు భూమిపై ఉన్న జీపీఎస్ (GPS), ఇంటర్నెట్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, విద్యుత్ గ్రిడ్‌లను దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ భారీ సౌర తుఫాను వీటిని తాకినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 'బ్లాక్‌అవుట్' అవుతుంది. దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. అయితే 'స్మైల్' అందించే ముందస్తు సమాచారం వల్ల ఇలాంటి నష్టాలను నివారించవచ్చు. విద్యుత్ అంతరాయాల ప్రమాదాన్ని తగ్గించి.. మౌలిక సదుపాయాలను రక్షించేందుకు ఈ మిషన్ ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
Also Read: సుప్రీం తీర్పుపై కేంద్రం సంచలనం.. వ్యభిచారంపై తీర్పు పునఃసమీక్షించాల్సిందే!
అయితే చైనా, యూరప్ దేశాలు కలిసి ఒక ఉపగ్రహాన్ని రూపొందించడం నుంచి దాన్ని ప్రయోగించి వరకు పూర్తిస్థాయిలో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విజయం భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహంపై చేపట్టే సంయుక్త మిషన్లకు బాటలు వేసేలా దారి చూపించనుంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు, ఉద్రిక్త పరిస్థితులతో సతమతమవుతున్న తరుణంలో.. భూమిని కాపాడుకునేందుకు చైనా, యూరప్ కలసి ఈ ప్రయోగాన్ని చేపట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us