/rtv/media/media_files/2025/02/26/YzXJP6mof5s8jDAy6I9P.jpg)
PM Modi and CM Stalin
నూతన విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)ని తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని ఇప్పటికే సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీని బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు కేంద్రం తమ రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇచ్చినా కూడా ఎన్‌ఈపీని అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే స్టాలిన్ చేసిన మరో సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు.. మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రభుత్వ విద్యను రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను నిలిపివేస్తోందని మండిపడ్డారు.
రూ.2 వేల కోట్ల కోసం హక్కులు వదులుకోం
జాతీయ విద్యా విధానాన్ని స్వీకరించకపోతే, ప్రస్తుతం అమలవుతున్న సమగ్ర శిక్ష అభియాన్ (SSA) కింద రాష్ట్రానికి దాదాపు రూ. 2400 కోట్ల నిధులు కేటాయించమని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం మరింత దుమారం రేపింది. దీనిపై స్పందించిన స్టాలిన్ రూ.2 వేల కోట్ల కోసం మా హక్కులు వదులుకోలేమని తెగేసి చెప్పారు. నూతన విద్యా విధానం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని.. తమిళ భాషకు ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దీన్ని అమలు చేస్తే తమిళనాడును 2000 సంవత్సరాలు వెనక్కి నెట్టినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది తమ రాష్ట్ర పిల్లల భవిష్యత్తుకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందన్నారు. కానీ తాము ఏ భాషను వ్యతిరేకించడం లేదని.. తమపై ఏదైన భాషను బలవంతగా రుద్దితే మాత్రం ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. ఈ అంశం తమిళనాడు హక్కులకు సంబంధించినదని.. పార్టీలకు అతీతంగా నాయకులు ఈ అంశంపై మాట్లాడాలని కోరారు.
Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
హిందీ బోర్డులపై నల్లరంగులు
మరోవైపు ఇటీవల అధికార డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైల్వేస్టేషన్లు, పోస్టాఫీసులతో పాటు వివిధ చోట్ల ఉన్న ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలపై నల్లరంగు పూస్తున్నారు. ఆదివారం డీఎంకే శ్రేణులు పాలైయంకోట్టై, పాలక్కాడ్ రైల్వే స్టేషన్‌లోని బోర్డులపై హిందీ పేర్లకు నల్ల రంగు వేశారు. సోమవారం కూడా దీన్ని పలు చోట్ల కొనసాగించారు. చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్, అలాగే జీఎస్టీ రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని హిందీ అక్షరాలతో ఉన్న సైన్ బోర్డులపై బ్లాక్ పెయింట్ వేశారు.
అయితే హిందీ భాషను వ్యతిరేకిస్తున్న డీఎంకేపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై మండిపడ్డారు. త్రిభాషా విధానంపై డీఎంకే పార్టీ కపటత్వం చూపిస్తోందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతల సొంత పిల్లలు బహు భాషా పాఠశాలల్లో చదువుకున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నలు గుప్పించారు. డీఎంకే అనేది వాళ్ల కుటుంబాలకు, ఇతరులకు భిన్నమైన ప్రమాణాలు పాటించే అవివేకుల సమూహం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను డీఎంకే తప్పు దారి పట్టిస్తోందని విమర్శించారు.
గతంలో కూడా హిందీ వ్యతిరేకోద్యమాలు
తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఇప్పడిది కాదు. మొదటిసారిగా 1937లోనే జరిగింది. మాద్రాసు ప్రెసిడెన్సీలో సి.రాజగోపాలచారి నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధనను అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీంతో అప్పట్లోనే మద్రాసులో హిందీ వ్యతిరేకోద్యమం జరిగింది. ఈవీ రామస్వామి నాయకర్ (పెరియార్), పన్నీర్‌సెల్వం నాయకత్వంలోని విపక్ష జస్టిస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. రాష్ట్రవ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. చివరికీ 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు. మూడేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో 1198 మంది అరెస్టు కాగా.. ఇద్దరు మరణించారు.
Also Read: ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్.. కవిత మళ్లీ జైలుకు!?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1950 జనవరి 26న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత అనేక హిందీయేతర రాష్ట్రాలు హిందీని ఏకైక అధికార భాషగా చేసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. 1965, 1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో త్రిభాష సూత్రం ద్వారా తమపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుపల్లో తాము ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని తేల్చిచెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఇలా ఆందోళనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
డీలిమిటేషన్‌తో రాష్ట్రాలపై కత్తి
మరోవైపు డీలిమిటేషన్‌పై కూడా స్టాలిన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోందని ఆరోపించారు. తమిళనాడు కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను నియంత్రించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో తక్కువగా జనాభా ఉంది కాబట్టి.. లోక్‌సభ స్థానాలు కూడా తగ్గే ఛాన్స్ ఉందన్నారు. దీనివల్ల తాము దాదాపు 8 సీట్లు కోల్పోతామని.. తద్వారా తమకు 31 మంది ఎంపీలు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. పార్లమెంటులో ఇప్పుడు తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారని చెప్పారు. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన గురించి చర్చించేందుకు డీఎంకే మార్చి 5న అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చిస్తారు ? ఏ నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: ముంచుకొస్తున్న ముప్పు.. అత్యంత కాలుష్య కోరల్లో భారత్.. టాప్-3లోనే!