West Bengal : బెంగాల్‌లో బీజేపీ 'నిశ్శబ్ద వ్యూహం'...ఐదు 'M' లే కీలకం...ఆ ఐదు 'M' లు ఏంటో తెలుసా?

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

New Update
FotoJet (22)

West Bengal elections

West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. గతంలో తృణమూల్ హవా ముందు బీజేపీ ఉనికి అంతగా లేకపోయినా ఈసారి మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బెంగాల్ రాజకీయాలను దశాబ్దాలుగా గమనిస్తున్న నిపుణులు ఈ ఎన్నికలను భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రసవత్తర క్రికెట్ మ్యాచ్‌తో పోలుస్తున్నారు.

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాలపై పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ జయంతో ఘోషల్ ఒక చర్చా కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదల ఒక అద్భుతమైన విజయగాథ అని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు కోల్‌కతాలో బీజేపీకి కేవలం ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే ఉండేవారని అప్పట్లో ఎల్‌కే అద్వానీ ఆ ఫలితాలకే ఎంతో సంతోషించారని గుర్తు చేశారు. శ్యామ్‌ ప్రసాద్ ముఖర్జీ వంటి గొప్ప నేతలు పుట్టిన ఈ గడ్డపై జనసంఘ్‌ను స్థాపించినా ఏమీ చేయలేకపోయామని గతంలో వాజ్‌పేయి కూడా తనతో అన్నట్లు ఆయన తెలిపారు. బెంగాల్‌లో విజయం సాధిస్తేనే బీజేపీ అసలైన జాతీయ పార్టీగా మారుతుందని అమిత్ షా బలంగా నమ్ముతున్నారు.

మరోవైపు విశ్లేషకులు మనోజ్ఞ లోయివాల్ ఈ ఎన్నికల సరళిని 5 'M'ల సూత్రంతో విశ్లేషించారు. మహిళలు (Mahila), మైనారిటీలు (Minority), కండబలం (Muscle), ధనబలం (Money) యంత్రాంగం (Machinery) ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయని ఆమె తెలిపారు. మమతా బెనర్జీకి ప్రధాన బలంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అలాగే మైనారిటీ ఓట్ల చీలిక తృణమూల్‌కు నష్టం కలిగిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. యంత్రాంగం పరంగా టీఎంసీ బలంగా ఉంటే ధన,కండబలంలో బీజేపీ దీటుగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నేరుగా విమర్శించకుండా ప్రధాని మోదీ సాగిస్తున్న 'సైలెంట్ క్యాంపెయిన్' ఈసారి ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

బీజేపీకి మోదీ,అమిత్ షా వంటి అగ్రనేతలు అండగా ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగత సామర్థ్యం ఇంకా బలంగానే ఉందని జయంతో ఘోషల్ విశ్లేషించారు. ప్రధాని మోదీ ఇస్తున్న హామీలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడంలో సువేందు అధికారి వంటి ప్రజా నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీ తన ప్రచారాన్ని కొన్ని నెలల ముందే ప్రారంభించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒడిశా వంటి రాష్ట్రాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన భూపేందర్ యాదవ్, ఆయన బృందం ఇక్కడ నిశ్శబ్ద వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు. వీరు పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్ది ఆరెస్సెస్, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం సాధించడంలో విజయం సాధించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎన్నికలు బెంగాల్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ, పట్టణంలో బీజేపీ?

రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23 మరియు ఏప్రిల్ 29 తేదీల్లో పోలింగ్ జరగనుండగా మే 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి 215 కంటే ఎక్కువ స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టీఎంసీ తరపున ఆమె భవానీపూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతుండగా పార్టీ మొత్తం 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన మూడు స్థానాలను తన మిత్రపక్షమైన గూర్ఖా జనముక్తి మోర్చాకు కేటాయించింది. సంక్షేమ పథకాలు, ప్రాంతీయ నాయకత్వమే తమను నాలుగోసారి అధికారంలోకి తెస్తాయని టీఎంసీ ధీమాగా ఉంది.

మరోవైపు బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి నందిగ్రామ్ , భవానీపూర్ వంటి కీలక స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. నిరుద్యోగం, అవినీతి, మహిళల భద్రత వంటి అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా బీజేపీ మలుచుకుంది. అధికార వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని,ఈసారి బెంగాల్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం రాష్ట్రంలో కేంద్ర భద్రతా దళాలను భారీగా మోహరించి పారదర్శకమైన పోలింగ్ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

రాజకీయ వ్యూహకర్తల విశ్లేషణ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ పట్టు కలిగి ఉండగా పట్టణ ,సెమీ-అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది. యువత, మొదటిసారి ఓటు వేసే ఓటర్ల తీర్పు ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఒడిశాలో పార్టీని విజయపథంలో నడిపిన భూపేందర్ యాదవ్ వంటి నేతలు ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేస్తున్నారు. కేవలం అభివృద్ధి ,మార్పు అనే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతుంటే సంక్షేమం , ప్రాంతీయ అస్తిత్వం అనే నినాదంతో టీఎంసీ పోరాడుతోంది. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న ఉత్కంఠభరిత పోరులో బెంగాల్ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.

Advertisment
తాజా కథనాలు