/rtv/media/media_files/2026/05/23/ai-cop-writer-app-introdueced-by-hyderabad-police-2026-05-23-13-19-30.jpg)
AI cop writer app introdueced by hyderabad police
పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు లేకుండా, వాళ్ల ఫిర్యాదులను వేగంగా, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైటర్ యాప్ ను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. దాని పనితీరును పరిశీలించారు.
నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలోకి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు వెంటనే రికార్డు చేసి, ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాష అర్థం కాక FIR నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం లాంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న యాప్ ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించింది.
హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే, అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదించబడుతుంది. గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం లాంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీంతో రికార్డులను తారుమారు చేసే ఛాన్స్ ఉండదు.
ఈ యాప్ బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, దేశంలోనే మొదటిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని సజ్జనార్ అన్నారు. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుందని చెప్పారు. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాక.. రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: కేరళలో ఇంటర్నేషనల్ సె*క్స్ రాకెట్ గుట్టు రట్టు.. వెలుగులోకి సంచలన విషయాలు
ఇదిలాఉండగా ఆధునిక పోలీసింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ AIని విస్తృతంగా వాడుతోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ పనితీరులో మరింత సామర్థ్యాన్ని పెంచే టార్గెట్‌తో టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగానే.. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పక్కాగా రూపొందించడానికి ఇప్పటికే 'సి-మిత్ర' లో ఏఐ సాంకేతికతను పోలీస్ శాఖ విజయవంతంగా అమలు చేస్తోంది. అలాగే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి విధులను కేటాయించే ప్రక్రియలో AIను వాడుతోంది. గతంలో ఉన్న మ్యాన్యువల్ పద్ధతుల స్థానంలో ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ విధానం వల్ల, ఎటువంటి పక్షపాతం లేకుండా సిబ్బందికి పోస్టింగ్‌లు కేటాయించబడుతున్నాయి. ఇది వ్యవస్థలో పూర్తి పారదర్శకతను పెంచుతోంది.
సోషల్ మీడియాలో సమాజ శాంతికి భంగం కలిగించే అంశాలను గుర్తించేందుకు 'సాక్-ఐ' అనే ఏఐ ఆధారిత యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆన్‌లైన్ కంటెంట్‌ను నిరంతరం పర్యవేక్షించడమే కాక.. మహిళల, చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే పోస్టులను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఫిర్యాదుల నమోదు ప్రక్రియను కూడా AIతో లింక్ చేయనుంది. అందుకుగాను ఏఐ కాప్‌రైటర్ యాప్‌ను రూపొందించింది. దీనివల్ల ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు మరింత వేగంగా, క్రమబద్ధంగా నమోదవుతాయి.
Follow Us