Trump White House Bunker: వైట్‌హౌస్‌లో హై అలర్ట్.. ట్రంప్‌ కోసం అమెరికా ఆర్మీ స్పెషల్‌ బంకర్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్సనల్ సెక్యూరిటీపై మునుపెన్నడూ లేని విధంగా దృష్టి సారించారు. చారిత్రక వైట్‌హౌస్ ప్రాంగణంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఓ భారీ భూగర్భ బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం నిర్మిస్తోంది.

New Update
white house

Trump White House Bunker

Trump White House Bunker: ఇరాన్‌తో యుద్ధం తీవ్రస్థాయికి చేరడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్సనల్ సెక్యూరిటీపై మునుపెన్నడూ లేని విధంగా దృష్టి సారించారు. చారిత్రక వైట్‌హౌస్ ప్రాంగణంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఓ భారీ భూగర్భ బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం నిర్మిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

బాల్‌రూమ్ కింద 'భూగర్భ' కోట

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తన కోసం నిర్మిస్తున్న కొత్త బాల్‌రూమ్ కింద ఈ భారీ సముదాయం తయారవుతోందని తెలిపారు.
ప్రైవేట్ నిధులతో నిర్మాణం:

ఈ కొత్త నిర్మాణంలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ దాడులను తిప్పికొట్టే యాంటీ-డ్రోన్ డిజైన్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ బాల్‌రూమ్ నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా, ప్రైవేట్ సంస్థల నుండి సేకరించిన నిధులను వాడుతున్నారు. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రముఖుల సమావేశాలకు, నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకార వేడుకలకు వేదిక కానుంది.

Also Read: ఫ్యాన్స్ కు షాకిచ్చిన పూనమ్ పాండే! ప్రెగ్నెన్సీనా..? లేక ఏప్రిల్ ఫూల్ స్టంటా..?

పాత 'పీఈఓసీ' స్థానంలో కొత్తది!

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి 'ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్' (PEOC) స్థానంలో ఈ కొత్త బంకర్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత సమయంలో పాత సెంటర్‌ను తొలగించారని, దానికి బదులుగా మరిన్ని ఆధునిక సదుపాయాలతో ఈ కొత్త కేంద్రాన్ని సైన్యం యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోంది.

అనుమతులు లేవని ఆరోపణలు.. కోర్టులో విచారణ!

ట్రంప్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతుల వివాదం: నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్ (NCPC) నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పర్యవేక్షణ కరువు: ఈ ప్రాజెక్టుపై అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ గానీ, ప్రజా పరిశీలన గానీ లేకపోవడంపై మేధావులు మండిపడుతున్నారు.

న్యాయపోరాటం: చారిత్రక కట్టడాల పరిరక్షణ సంస్థ 'నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టోరిక్ ప్రిజర్వేషన్' ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలోనే కీలక విచారణ జరగనుంది.

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ అంశంపై మాట్లాడుతూ.. "సైన్యం కొన్ని ఆధునీకరణ పనులు చేస్తోంది, అధ్యక్షుడి అభిరుచికి అనుగుణంగా బాల్‌రూమ్ సిద్ధమవుతోంది" అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడి చుట్టూ నిర్మిస్తున్న ఈ 'అభేద్యమైన కోట' వెనుక ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో వేచి చూడాలి.

Also Read: 'ఏప్రీల్ 1'న చూసిందల్లా నమ్మేయకండి..! ఫూల్స్ డే చరిత్ర ఇదే! ఇంతకీ 'ఏప్రిల్'ను కరెక్టుగానే చదివారా?

1792లో ప్రారంభమై 1800లో పూర్తి

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయమైన 'వైట్ హౌస్' ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భవనాల్లో ఒకటి. ఇది అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని '1600 పెన్సిల్వేనియా ఎవెన్యూ'లో ఉంది. ఐరిష్ వాస్తుశిల్పి జేమ్స్ హోబన్ దీనిని డిజైన్ చేశారు. దీని నిర్మాణం 1792లో ప్రారంభమై 1800లో పూర్తయింది. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ దీని నిర్మాణాన్ని పర్యవేక్షించినప్పటికీ, ఇందులో నివసించిన మొదటి అధ్యక్షుడు మాత్రం జాన్ ఆడమ్స్. 1814లో బ్రిటిష్ వారు ఈ భవనానికి నిప్పు పెట్టారు. ఆ మచ్చలను కవర్ చేయడానికి దీనికి తెలుపు రంగు వేశారు. అప్పటి నుండి దీనిని 'వైట్ హౌస్' అని పిలవడం మొదలైంది. 1901లో అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ ఈ పేరును అధికారికం చేశారు. వైట్ హౌస్ కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, అది ఓ భారీ సముదాయం. ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్: ఇది భవనం మధ్యలో ఉంటుంది. ఇక్కడే అధ్యక్షుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తారు. వివిధ అధికారిక విందులు ఇక్కడే జరుగుతాయి.
వెస్ట్ వింగ్: ఇది అత్యంత కీలకమైన విభాగం. అధ్యక్షుడి అధికారిక కార్యాలయమైన 'ఓవల్ ఆఫీస్' ఇక్కడే ఉంటుంది. అలాగే క్యాబినెట్ రూమ్, సిట్యుయేషన్ రూమ్ (కీలక నిర్ణయాలు తీసుకునే చోటు) కూడా ఇక్కడే ఉంటాయి.
ఈస్ట్ వింగ్: ఇది సాధారణంగా అమెరికా ఫస్ట్ లేడీ ఆఫీస్‌గా పనిచేస్తుంది. సామాజిక కార్యక్రమాల నిర్వహణ ఇక్కడి నుంచే జరుగుతుంది.

వైట్ హౌస్ లోపల ఒక చిన్న నగరం లాంటి సదుపాయాలు ఉంటాయి. మొత్తం 132 గదులు, 35 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. 6 అంతస్తులు (భూగర్భంతో కలిపి). ఇందులో సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, బౌలింగ్ అల్లే, ఒక పెద్ద కిచెన్ (ఒకేసారి 140 మందికి విందు ఇవ్వగలదు) ఉన్నాయి. 412 తలుపులు, 147 కిటికీలు ఉన్నాయి. దీని చుట్టూ అత్యంత కఠినమైన భద్రత ఉంటుంది. రాడార్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలు భూగర్భంలో అత్యవసర సమయాల్లో దాక్కునేందుకు బంకర్లు (PEOC) ఉంటాయి. వైట్ హౌస్ సందర్శనకు వెళ్లాలనుకుంటే చాలా నెలల ముందే దరఖాస్తు చేసుకోవాలి. విదేశీయులు తమ దేశ రాయబార కార్యాలయం ద్వారా దీని కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు