/rtv/media/media_files/2025/02/24/FVnNZ2OUN6PaZSBTAQCD.jpg)
Three Years Into Russia-Ukraine War
2022 ఫిబ్రవరి 24న ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ పేరుతో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలు ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందనే సాకులు చెప్పి రష్యా ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది. నాటో విస్తరణను నిలువరించడం, డాన్‌బాస్ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటి తమ లక్ష్యాలని పుతిన్ ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై నేటికి మూడేళ్లు అయ్యింది. గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఇరువైపుల లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బిలియన్ల డాలర్ల మేర ఆస్తినష్టం జరిగింది. శివారు గ్రామాలు, పట్టణాలు మరుభూములుగా మారాయి.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్‌లో జరిగిన అతిపెద్ద యుద్ధం ఇదే. అయితే యుద్ధానికి 2014లోనే పునాదులు పడ్డాయి. ఆ ఏడాది ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపాన్ని రష్యా ఆక్రమించుకుంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో యుద్ధానికి దిగింది. వందలకొద్ది క్షిపణులు ప్రయోగించింది. పెద్ద ఎత్తున సైనికులను మోహరించింది. ఉక్రెయిన్ కూడా అమెరికా, యూరప్ దేశాల సాయంతో రష్యాపై ఎదురుదాడులకు దిగింది.
Also Read: అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!
18 శాతం భూభాగం ఆక్రమణ
అంతర్జాజీయ మీడియా కథనాల ప్రకారం చూసుకుంటే.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్‌లో కేవలం 18 శాతం భూభాగం మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, డినిప్రో, ఒడెసా, లివివ్ లాంటి ప్రధాన నగారాలపై ఈ దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్రదేశాల ద్వారా ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలు రావడమే దీనికి ప్రధాన కారణం. రష్యాకు ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి మాత్రమే ఆయుధ సాయం అందింది. అలాగే అమెరికా, ఇతర యూరప్ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. యుద్ధం వల్ల విదేశీ వస్తువుల లభ్యత తగ్గడంతో డిమాండ్ పెరిగింది. ద్రవ్యోల్బణం కూడా పెరగడంతో రష్యన్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రష్యాలో కూడా అక్కడి పౌరుల్లో కొందరు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.
60 లక్షల మంది శరణార్థులుగా
మరోవైపు ఈ యుద్ధం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మిత్రదేశాల నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందుతున్నప్పటికీ అవి సైనిక, రక్షణపరంగా మాత్రమే. సాధారణ ప్రజల జీవితాలను మార్చే సాయం కాదు. యుద్ధం కారణంగా పోలండ్,రోమేనియా సహా పలు దేశాల్లోకి దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలస వెళ్లిపోయారు.
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో కూడా ఆయన చర్చలు జరిపారు. చర్చలు మరింత విస్తృత స్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటిదాకా రష్యా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని.. ప్రస్తుత వాస్తవాదీన రేఖనే అంగీకరిస్తూ జెలెన్‌స్కీని ఒప్పించాలని ట్రంప్ భావస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
అంతేకాదు ఇటీవల ట్రంప్.. ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల డీల్‌ను కూడా ఆఫర్ చేశారు. తమ మద్దతు కొనసాగాలంటే ఇందుకు బదులుగా 500 బిలియన్ డాలర్లు విలువైన ఖనిజాలను తమకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌లో అరుదైన భూగర్భ ఖనిజాలు, గ్యాస్, చమురు, పోర్టులు, మౌలిక సదుపాయాలతో పాటు ఆ దేశంలో ఉన్న సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. కానీ అమెరికా.. ఉక్రెయిన్ నుంచి కావాలనుకున్న ఈ మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువే.
Also Read: ట్రంప్ ప్రభుత్వంపై నిరసన సెగలు.. '50501 ఉద్యమం' పేరిట రోడ్లపైకి జనాలు
ఒకవేళ ఈ డీల్ కుదిరితే ఉక్రెయిన్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల రూల్స్‌ను నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్‌కు నియంత్రణ దక్కే ఛాన్స్ ఉంటుంది. ఈ డీల్‌లో అమెరికాకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అందుకే ఈ డీల్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. రష్యాపై యుద్ధం చేసేందుకు అమెరికా తమకు 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందించిందని తాజాగా జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటిదాకా 320 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. ఇందులో 120 బిలియన్ డాలర్లు ప్రజల నుంచే సేకరించామని, మరో 200 బిలియన్ డాలర్లు ఐరోపా సమాఖ్య, అమెరికా ఇచ్చినట్లు జెలెన్‌స్కీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
ట్రంప్ అసంతృప్తి
చాలా సందర్భాల్లో ఉక్రెయిన్‌కు సాయం చేశామని.. ఓసారి ఏకంగా 350 బిలియన్ డాలర్లు ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన జెలెన్‌స్కీ అమెరికా నుంచి ఇప్పటిదాకా 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందినట్లు పేర్కొన్నారు. అయితే జెలెన్‌స్కీ తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందా ? లేదా అలాగే కొనసాగుతుందా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది.