/rtv/media/media_files/2025/03/21/M6mCpYiaaLej1nWqIe9P.jpg)
Attacks On Gaza
గాజా పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ విలవిలాడుతుంది. ఈ క్రమంలో హమాస్ సంస్థకు చెందిన కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో మిలిటెంట్ సంస్థకు చెందిన రాజకీయ నాయకుడు సలాహ్ అల్ బర్దావీల్ మరణించినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని హమాస్ స్వయంగా వెల్లడించింది.
ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బర్దావీల్,అతడి భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా వెల్లడించింది. మిలిటెంట్ సంస్థకు చెందిన మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బర్దావీల్, అతడి భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడికి గురై చనిపోయినట్లు పేర్కొన్నారు.
ఇది తమ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేదని హమాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటెంట్ సంస్థకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్ ను తమ బలగాలు హతమార్చాయని టెల్ అవీవ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ -హమాస్ ల మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఇటీవల ఉల్లంఘనకు గురైన సంగతి తెలిసిందే.
గత మంగళవారం గాజా పై ఐడీఎఫ్ దళాలు భారీ దాడులు చేశాయి. ఇందులో 400 మందికి పైగా మృతి చెందగా..అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు,మహిళలే ఉన్నారు. కాల్పుల విరమన ఒప్పందం మార్పులను హమాస్ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించింది. గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరికలు చేశారు.
మరో వైపు..హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్ మధ్య గత నవంబరులో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందమూ ఉల్లంఘనకు గురైంది.శనివారం లెబనాన్ నుంచి ఆరు రాకెట్లు తమ భూభాగంలోకి దూసుకొచ్చాయని ఐడీఎఫ్ ఆరోపిస్తూ..దక్షిణ లెబనాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారని, 12 మందికి గాయాలయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు.
Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!
Also Read: Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!
hamas | gaza | israel | attacks | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates