/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-12-10-36.jpg)
iran embassy in uk
IRAN TWEET ON WAR : అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ దౌత్య వేదికలపైకి, సోషల్ మీడియా రణరంగంలోకి పాకాయి. బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయం (Embassy) తాజాగా చేసిన ఒక వివాదాస్పద పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ మాతృభూమి కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావాలంటూ ఇరాన్ ఎంబసీ ఇచ్చిన పిలుపు బ్రిటన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది.
యూకేలోని ఇరాన్ దౌత్య కార్యాలయం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో బ్రిటన్ లో నివసిస్తున్న ఇరాన్ పౌరులను ఉద్దేశించి ఒక సంచలన ప్రకటన చేసింది. అమెరికా,ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న యుద్ధం లేదా ఘర్షణల నేపథ్యంలో శత్రువులకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచవద్దని ఆ పోస్ట్‌లో పేర్కొంది. దేశాన్ని శత్రువుల చేతుల్లో పెట్టే కంటే, మాతృభూమి గౌరవం కోసం ప్రాణాలర్పించడం మిన్న అని పిలుపునిచ్చింది. అంతేకాకుండా, దేశం కోసం 'బలిదానానికి' (Martyrdom) సిద్ధంగా ఉన్నవారు తమను సంప్రదించాలని కోరడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ పోస్ట్ ప్రజలను హింస వైపు ప్రేరేపించేలా ఉందంటూ బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ విదేశీ పౌరులను బలిదానానికి ప్రేరేపించడం దౌత్య నిబంధనలకు విరుద్ధమని యూకే అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరాన్ రాయబారి సయ్యద్ అలీ మౌసావినికి బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ తక్షణమే సమన్లు జారీ చేసింది. ఒక దౌత్య కార్యాలయం యుద్ధాన్ని లేదా మతపరమైన బలిదానాలను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. అయితే, బ్రిటన్ హెచ్చరికలను ఇరాన్ దౌత్య కార్యాలయం తోసిపుచ్చింది. తమ పోస్ట్‌ను సమర్థించుకుంటూ రాయబార కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసింది. ఇది హింసను ప్రేరేపించడం కాదని, కేవలం దేశభక్తిని, మాతృభూమి పట్ల విధేయతను చాటుకోవడం మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఇరాన్ పౌరులు తమ దేశ రక్షణకు కట్టుబడి ఉంటారని, ఆ స్ఫూర్తిని చాటడమే తమ ఉద్దేశమని పేర్కొంది.
ఈ పరిణామం అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి తనతో సహా దేశ ప్రజలందరూ ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. అధ్యక్షుడి అడుగుజాడల్లోనే దౌత్య కార్యాలయం కూడా ఈ విధమైన ప్రచారానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, లండన్ వంటి అంతర్జాతీయ నగరాల్లో ఇరాన్ అనుసరిస్తున్న ఈ దూకుడు వైఖరి బ్రిటన్ భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ పోస్ట్ కేవలం భావోద్వేగపూరితమైనదా లేక దీని వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ వివాదం అమెరికా-ఇరాన్ సంబంధాలతో పాటు బ్రిటన్-ఇరాన్ దౌత్య సంబంధాలను కూడా మరింత సంక్లిష్టం చేసేలా కనిపిస్తోంది.
Follow Us