/rtv/media/media_files/2026/03/31/iran-waring-2026-03-31-21-51-13.jpg)
మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం ఇప్పుడు అమెరికా టెక్ కంపెనీలపై పడనుంది. ఇరాన్ కన్ను అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలపై పడింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఓ షాకింగ్ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో సంబంధం ఉన్న ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. మొత్తం 18 అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
టెక్ దిగ్గజాలకు 'డెడ్ లైన్'
ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి ప్రధాన అమెరికన్ కంపెనీల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని IRGC స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తమ దేశంపై జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు రివేంజ్‌గా ఈ కంపెనీల యూనిట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. దీంతో సదరు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు వెంటనే బయటకు రావాలని, అలాగే ఆయా కార్యాలయాలకు ఒక కిలోమీటరు పరిధిలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇరాన్ సూచించింది.
అమెరికా వార్నింగ్
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అంతకుముందే ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన షరతులకు అంగీకరించకపోతే తీవ్ర సైనిక చర్య తప్పదని ఆయన హెచ్చరించారు. "ట్రంప్ బెదిరింపులకు దిగరు, అలాగే వెనకడుగు వేయరు. రాబోయే రోజులు ఇరాన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ కొత్త నాయకత్వం గత ప్రభుత్వం కంటే వివేకంతో వ్యవహరించి ఒప్పందానికి రావాలని సూచించారు. అంతేకాకుండా, గతంలో కువైట్ వద్ద 'స్నేహపూర్వక కాల్పుల' వల్ల కూలిపోయాయని భావించిన F-15 యుద్ధ విమానాలపై హెగ్సెత్ సంచలన నిజం వెల్లడించారు. ఆ విమానాలు టెహ్రాన్‌పై బాంబు దాడులు నిర్వహించాయని ఆయన పేర్కొనడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
చర్చల వార్తలను తోసిపుచ్చిన ఇరాన్
మరోవైపు, అమెరికాతో తాము ఎలాంటి అధికారిక చర్చలు జరపడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మధ్యవర్తుల ద్వారా తమకు అందుతున్న డిమాండ్లు "అసమంజసంగా, మితిమీరినవిగా" ఉన్నాయని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పేర్కొంది. యుద్ధాన్ని ముగించాలన్న ప్రతిపాదనలను స్వాగతిస్తున్నప్పటికీ, అసలు ఈ ఘర్షణను ప్రారంభించింది అమెరికాయేనని ఇరాన్ ఎదురుదాడికి దిగింది.
Follow Us