/rtv/media/media_files/2026/04/22/britain-2026-04-22-20-27-03.jpg)
Britain
మధ్య ఆసియాలోని ఐదు దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, అలాగే ఉజ్బెకిస్తాన్‌లపై అగ్రదేశాల దృష్టి మళ్లింది. ఒకప్పుడు రష్యాకు బలమైన కోటలుగా ఉన్న ఈ ప్రాంతాలపై బ్రిటన్(britain) ఇప్పుడు ఫోకస్ పెట్టింది. తన ప్రభావాన్ని ఆ దేశాల్లో పెంచుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. 1991లో సోవియట్ యూనియన్ పతనం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్ ఈ దేశాలను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మారడంతో తన వ్యూహాన్ని మార్చుకుంది. 19వ శతాబ్దపు 'గ్రేట్ గేమ్' తరహాలోనే ఈ ప్రాంతాలపై పట్టు కోసం రష్యా, చైనాలతో పోటీ పడుతోంది.
వాస్తవానికి బ్రిటన్ ఈ ప్రాంతంపై ఆసక్తి చూపించేందుకు ప్రధాన కారణం ఆర్థిక అవసరాలు. బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చింది. దీంతో ఆ దేశానికి కొత్త మార్కెట్లు అత్యవసరమయ్యాయి. అందుకే ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలకు పన్ను రహిత వ్యాపార వెసులుబాటు అందించింది. అలాగే బ్రిటన్‌లో నెలకొన్న కార్మికుల కొరత తీర్చేందుకు మధ్య ఆసియా యువతకు వీసా రూల్స్‌ను సడలించింది. వీళ్లను వ్యవసాయం, నర్సింగ్ లాంటి రంగాల్లోకి ఆహ్వానిస్తోంది.
Also Read: హర్మూజ్ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్
Britain Jumps Into Central Asia
ఇక భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలు, హరిత ఇంధనం వాడకం పెరగనుంది. వీటికి అవసరమైన లిథియం, యూరేనియం లాంటి అరుదైన మూలకాల కోసమే బ్రిటన్ వేట ప్రారంభించింది. ఇలాంటి ఖనిజాలు సరఫరా చేయడంతో ప్రస్తుతం చైనాకు గుత్తాధిపత్యం ఉంది. అందుకే బ్రిటన్ మధ్య ఆసియా దేశాల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ దేశాలతో ఖనిజ సంపదపై బలమైన సరఫరా గొలుసు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సాఫ్ట్ పవర్‌ను ప్రయోగిస్తోంది.
మధ్య ఆసియా దేశాల్లో బ్రిటిష్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం, సంస్కృతిని ప్రోత్సహిస్తూ యువతీ యువకులను ఆకట్టుకుంటోంది. దీనివల్ల ఆ దేశాలతో భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు సులభతరమవుతుందని బ్రిటన్ భావిస్తోంది. ఇప్పటికే రైల్వే, ఎయిర్‌పోర్టులు, మైనింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి తన ఉనికిని చాటుకుంటోంది.
Also Read: పరువు తీసేశారు.. విదేశీ హోటల్‌లో వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ భారతీయులు
అయితే బ్రిటన్ ఆశించినట్లుగా అంత ఈజీగా ఈ మార్గం సాగడం లేదు. మధ్య ఆసియా దేశాల్లోని కొనసాగుతున్న నియంతృత్వ పోకడలు, మానవ హక్కుల ఉల్లంఘనలు బ్రిటన్‌కు పెద్ద సవాలుగా మారిపోయాయి. రష్యా, చైనాలు నైతిక విలువలతో పనిలేకుండా వ్యాపారం చేస్తున్నాయి. కానీ బ్రిటన్ మాత్రం ప్రజాస్వామ్య విలువల పేరుతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులున్నాయి. ఇక బ్రిటన్ కేటాయిస్తున్న అరకొర బడ్జెట్ సాయం కూడా.. చైనా బిలియన్ డాలర్ల పెట్టుబడుల ముందు ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.
Follow Us