దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటుండగా... తెలంగాణలో మాత్రం నవమాసాలు మోసి..కని పెంచిన కన్నతల్లినే నరికి చంపాడో పుత్ర రత్నం. ఈ దారుణ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది.
Also Read: SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మంత్రి ఉత్తమ్ రివ్యూ.. కాసేపట్లో మీడియాతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ కు చెందిన చదిరం కుమార స్వామి, రేణుక (40) దంపతులకు ఇద్దరు కొడుకులు. కుమార స్వామి 15 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. దీంతో తల్లి రేణుకనే కుమారులిద్దరిని పోషించింది.
చిన్న కొడుకు విజయ్ హైదరాబాద్ లో ఉంటూ అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెద్ద కొడుకు అజయ్ రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే తల్లికొడుకులకు ఆర్థిక లావాదేవీల దగ్గర గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వివాహం అయిన తరువాత నుంచి ఆ గొడవలు మరింత పెరిగాయి.
తల్లిని గొడ్డలితో...
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా తల్లి కొడుకుల మధ్య మరోసారి పెద్ద వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి గురైన అజయ్ తల్లిని గొడ్డలితో నరికేశాడు. దీంతో రేణుక అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న ఎల్కతుర్తి సీఐ రమేశ్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు గ్రామస్థులు అంటున్నారు.