/rtv/media/media_files/2026/05/11/pm-modi-2026-05-11-21-38-06.jpg)
PM Modi’s Gold Appeal Triggers Sharp Selloff In Titan, Kalyan Jewellers
ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని చేసిన ప్రతిపాదన వల్ల స్టాక్ మార్కెట్లు షేక్ అయిపోయాయి. బంగారం వినియోగం భారీగా తగ్గిపోతుందని పెట్టుబడుదారులు భయందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది. వీటితో పాటు సెన్కో గోల్డ్, స్కై గోల్డ్ లాంటి ఇతర కంపెనీల షేర్లు సైతం 10 నుంచి 12 శాతం వరకు క్షీణించాయి
ప్రధాని మోదీ ప్రకటనతో షేర్ మార్కెట్ అతలాకుతలమైనా.. సాధారణ పసిడి ప్రియుల కొనుగోలు ధోరణిలో అలాగే స్థానిక రిటైల్ మార్కెట్ వ్యాపారాల్లో మాత్రం పెద్దగా మార్పు జరగలేదని క్షేత్రస్థాయి వ్యాపారులు అంటున్నారు. అయితే దేశీయంగా పసిడి ధరల్లో సోమవారం తగ్గుదల నమోదైంది. ఈ తాజా మార్పుల వల్ల దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 600కి పైగా దిగొచ్చి రూ. 1,51,920 వద్ద ముగిసింది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపిన గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 1,53,550 కి చేరింది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 200 క్షీణించి రూ. 1,40,650 వద్ద ముగిసింది. అలాగే వెండి ధర కిలోకి రూ. 2.85 లక్షల వద్ద స్థిరంగా ఉంది.
ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత విదేశీ మారక నిల్వలపై తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. సాధారణంగా భారత్ తన చమురు అవసరాలతో సహా బంగారం కోసం భారీ మొత్తంలో డాలర్లను ఖర్చు చేసి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో డాలర్లతో కూడిన దేశీయ విదేశీ మారక నిల్వలు తగ్గకుండా కాపాడుకునేందుకు విదేశీ ప్రయాణాలతో పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Follow Us