అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపైనా తాము కూడా సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ఈ టారిఫ్ రూల్స్ అమలు చేస్తున్నారు.
కాంబోడియాపై ట్రంప్ అత్యధికంగా 49 శాతం టారిఫ్ విధించాడు. తర్వాత లావోస్‌పై 48శాతం, మడగాస్కర్‌పై 47శాతం, వియాత్నంపై 46శాతం మయన్మార్, శ్రీలంకలపై 44 శాతం, సిరియాపై 41, ఇరాక్ పై 39, గయానాపై 38, చైనాపై 34, ఇండోనేషియాపై 32, పాకిస్థాన్‌పై 29, ఖజికిస్తాన్ పై 27, బంగ్లేదేశ్‌పై 37శాతం అమెరికా దిగుమతి సుంకాలు విధిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాలపై 20శాతం సుంకాలు ప్రకటించాడు ట్రంప్. సౌత్ ఆఫ్రికా నుంచి 30, ఆస్ట్రేలియా నుంచి 10, ఆఫ్ఘనిస్థాన్, మాంగోలియా, ఇరాన్, సుడాన్, సౌదీ అరేబియా దేశాల నుంచి 10 శాతం దిగుమతి పన్నులను వసూలు చేస్తున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే 26శాతం టారీఫ్ ట్యాక్స్‌గా ట్రంప్ నిర్ణయించాడు.
ట్రంప్ టారిఫ్‌ల ప్రకటనతో భారత్‌లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే అంచనాలను మించి భారత్‌పై ట్యాక్స్ బాంబ్ వేశారు. తమకు భారత్ వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే ఉన్న ట్రంప్.. సుంకాల విషయంలో మాత్రం ఏ మాత్రం కనికరం చూపించలేదు. అయితే అమెరికా ఉత్పత్తి చేసే వస్తువులపై ఆయా దేశాలు విధించే టారిఫ్‌లతో పోలిస్తే.. తాము సగం వరకు మాత్రమే సుంకాలు వసూలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటున 52 శాతం సుంకాలు విధిస్తున్నండగా.. తాము మాత్రం కేవలం 26 శాతం సుంకాలు మాత్రమే వేస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ టారిఫ్‌ల నిర్ణయంతో భారత్‌లోని వ్యవసాయ అనుబంధ, ఫార్మా ఉత్పత్తులపై కీలక ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా 18 శాతం. 2023-24లో భారతదేశం మొత్తం 778.21 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. అందులో అమెరికాకు దాదాపు 177 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి చేయబడ్డాయి.
భారత్‌లో ఈ పరిశ్రమలకు దెబ్బ
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్-జీటీఆర్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వ్యవసాయ రంగ వస్తువులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. రొయ్యలు, ఇతర సీఫుడ్ ఉత్పత్తులకు అమెరికా ప్రధాన దిగుమతిదారుగా ఉంది. గతేడాది భారత్ నుంచి అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతుల విలువ 2.58 బిలియన్ డాలర్లుగా ఉండగా.. తాజాగా వాటిపై సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లలో వీటి ధరలు పెరిగి డిమాండ్ తగ్గిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్ నుంచి ప్రతీ సంవత్సరం 11.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. తాజాగా టారిఫ్‌ల పెంపుతో ఈ ఉత్పత్తులపై సుంకాలు 13.32 శాతానికి చేరనున్నాయి. ఫుట్‌వేర్ పరిశ్రమపైనా అమెరికా సుంకాల ప్రభావం పడనుంది. భారత్ నుంచి 457.66 మిలియన్ డాలర్ల విలువైన ఫుట్‌వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ 2024లో ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాలకు సంబంధించి.. 14.39 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. తాజా సుంకాల పెంపుతో అమెరికా మార్కెట్‌లో భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. బాయిలర్లు, టర్బైన్లు, కంప్యూటర్ల ధరలు కూడా అమెరికాలో పెరగనున్నాయి.
ట్రంప్ టారిఫ్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు
అమెరికన్ పరిశ్రమలను రక్షించడం
ట్రంప్ టారీఫ్‌లు పెంచడానికి మొదటి కారణం.. అమెరికా పరిశ్రమలను విదేశీ పోటీ నుండి కాపాడటం. దిగుమతులపై పన్ను విధించడం వల్ల అమెరికన్ వినియోగదారులు దేశీయంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీంతో కీలక రంగాలలో ఉద్యోగాలను కాపాడుకోవచ్చుని ట్రంప్ గవర్నమెంట్ భావిస్తోంది.
ఫెడరల్ ఆదాయాన్ని పెంచడం
సుంకాలు అమెరికా ప్రభుత్వానికి అదనపు ఆదాయ మార్గాన్ని అందిస్తాయి. దిగుమతిదారులు విదేశీ వస్తువులపై సుంకాలు చెల్లిస్తుండటంతో, ఫెడరల్ ట్రెజరీ ఈ చెల్లింపుల నుండి ప్రయోజనం పొందుతుంది, ఇది స్వల్పకాలిక ఆర్థిక ప్రోత్సాహాన్ని సృష్టిస్తుంది.
దేశీయ తయారీని ప్రోత్సహించడం
ఈ టారీఫ్‌ల పెంపు.. ఇతర దేశాల పెట్టుబడిదారులు వచ్చి అమెరికాలో పరిశ్రమలు స్థాపించే అవకాశాన్ని కూడా పెంచుతాయి. సుంకాలు కట్టకుండా ఉండేందుకు కొన్ని కంపెనీలు నేరుగా అమెరికాలోనే మ్యానిఫ్యాక్టరింగ్ ఫ్యాక్టరీలు పెడతాయి.
ట్రంప్ టారిఫ్‌ల వల్ల కలిగే నష్టాలు
వినియోగదారులపై అధిక ధరల భారం
అమెరికన్ వినియోగదారలపై అధిక రేటు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. దిగుమతి సుంకాలు పెంచడం వల్ల.. ఆయా కంపెనీలు తిరిరి ఆ భారాన్ని వినియోగదారులపై మోతే అవకాశమే ఉండొచ్చు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ నుండి రోజువారీ కిరాణా సామాగ్రి వరకు వస్తువుల ధరలు గణనీయంగా పెరగవచ్చు. ఈ టారీఫ్‌లు అమెరికా GDPని 0.64శాతం వరకు తగ్గించగలవని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికాకు ఓ నష్టమే.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం
సుంకాల ప్రభావం అమెరికాకే పరిమితం కాలేదు. ఆర్థికవేత్తలు అంచనా ప్రకారం చైనా జిడిపి 0.68% తగ్గవచ్చు, యూరోపియన్ యూనియన్ 0.11% తగ్గవచ్చు. ఇవి ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయి. అదే కాదు సరిహద్దుల వెంబడి ఆర్థిక వృద్ధిని ఎలా అడ్డుకుంటాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ద్రవ్యోల్బణం, వడ్డీ రేటు ఆందోళనలు
వస్తువుల ధరలను పెంచడం ద్వారా సుంకాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదం చేస్తాయి. దీనికి ప్రతిస్పందనగా, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవచ్చు. ఆర్థిక వృద్ధిని మందగించవచ్చు మరియు వ్యాపారాలు మరియు వినియోగదారులకు రుణ ఖర్చులను పెంచవచ్చు.
సప్లైయ్ చైన్‌లో అంతరాయం..
ఆధునిక పరిశ్రమలు వరల్డ్ సప్లైయ్ చైన్‌పై ఎక్కువగా ఆధారపడతాయి. ట్రంప్ పెంచిన టారీఫ్ ఛార్జీలు ఈ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అధిక ఖర్చులు, లాజిస్టికల్ సవాళ్లు సాంకేతిక, ఆటోమోటివ్ మరియు రిటైల్ ఉత్పత్తికి అంతరాయం కలిగించవచ్చు.
ప్రతీకార వాణిజ్య యుద్ధాలకు తెర
అత్యంత ముఖ్యమైన ప్రమాదం వాణిజ్య యుద్ధానికి అవకాశం. US సుంకాల ద్వారా ప్రభావితమైన దేశాలు తమ సొంత చర్యలతో ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఈ కోపంతో అమెరికా లేదా ఇతర దేశాలపై దిగుమతి పన్నులు పెంచితే.. అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది.
ట్రంప్ సుంకాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాలు
చైనా: ట్రంప్ మొదటి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనా వస్తువులపై అదనంగా 10% సుంకాలు విధించడం వల్ల దాని జిడిపి 0.68% తగ్గిందని అంచనా.
మెక్సికో: మెక్సికన్ దిగుమతులపై ప్రతిపాదిత 25% సుంకం దాని ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా హాని కలిగిస్తుంది. ఎందుకంటే అమెరికా దాని అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
కెనడా: ఇలాంటి 25% సుంకాన్ని ఎదుర్కొంటే, కెనడా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే కెనడా ఎగుమతుల్లో 75% అమెరికాకు వెళ్తాయి.
యూరోపియన్ యూనియన్: EU, ముఖ్యంగా జర్మనీ, ఎగుమతులపై, ముఖ్యంగా ఆటోమోటివ్ రంగంలో ఆధారపడటం వల్ల గణనీయమైన నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.