/rtv/media/media_files/2024/11/25/n0nZGPEmIi1XzWVd12GW.jpg)
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీని ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యా్ప్తు బృందం (SIT) ఎట్టకేలకు విచారణ ప్రారంభించింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతికి చేరుకోలేదు. కానీ డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు. ఆదివారం ఒక టీమ్ వైష్ణవి డెయిరీకి, మరో టీమ్ తమిళనాడులోని దిండుగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీకి, మరో టీమ్ చెన్నైలోని ఎస్‌ఎంఎస్ ల్యాబ్‌కు వెళ్లాయి.
Also Read: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత
అయితే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ తాము అందించిన నెయ్యి నాణ్యమైనదని చెబుతూ ల్యాబ్ జారీ చేసిన సర్టిఫికేట్‌ను సమర్పించడంతో సిట్ బృందం దీనిపై దృష్టి సారించింది. ఆ ల్యాబ్ సర్టిఫికేట్ నిజమా ? కాదా ? దేని ఆధారంగా దాన్ని నిర్ధారించారు ? నాణ్యతను గుర్తించిన నిపుణులు ఎవరు ? వంటి వివరాలు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు రంగ ప్రవేశం చేశాక ఈ వ్యవహారంపై సంబంధిత నిపుణులు లోతుగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
అధికారుల బృందాల్లో ఒకటి వైష్ణవి డెయిరీలో, మరొకటి దిండుగల్‌లోని ఏఆర్ డెయిరీ తనిఖీలు చేపట్టాయి. అయితే ఈ రెండు డెయిరీల సామర్థ్యంపై ఫోకస్ పెట్టాయి. ఈ డెయిరీలను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? ఎన్ని సెంటర్లు ఉన్నాయి ? రోజువారి పాల సేకరణ ఎంత ? ప్రాసెస్ చేసే సమయంలో ఆవు పాలు, గేదె పాలు రెండు కలిపి వెన్న తీస్తున్నారా ? పాల నుంచి వెన్న ఎంతశాతం వస్తోంది ? తిరుమలకు ఈ డెయిరీలే స్వయంగా నెయ్యి సరఫరా చేస్తున్నాయా లేదా ఇతర డెయిరీలు చేస్తున్నాయా ? అనే కోణాల్లో సిట్ టీమ్ వివరాలు సేకరిస్తోంది.
Also Read: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
అయితే వైష్ణవి డెయిరీకి టీటీడీకి నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదని సిట్ టీమ్ ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. రెండు డెయిరీల రికార్డులు పరిశీలించి అవసరమైన పత్రాలను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఏఆర్ డెయిరీ మధ్యాహ్నం 1 గంట నుంచి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో తిరుపతికి చెందిన 11 మంది అధికారులు పాల్గొన్నారు.